ఆసీస్ టూర్‌లో టీమిండియా సాధించిన గత రెండు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసిన జడ్డూ, నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 44 పరుగులు చేసి భారత జట్టు మంచి టార్గెట్ ఇవ్వడానికి కారణమయ్యాడు. అయితే ఆఖరి ఓవర్‌లో రవీంద్ర జడేజాకి గాయమైన సంగతి తెలిసిందే.

మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్‌లో బంతి బలంగా వచ్చి, రవీంద్ర జడేజా హెల్మెట్‌కి తగిలింది. ఈ కారణంగా అతనికి కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా యజ్వేంద్ర చాహాల్‌ను జట్టులోకి తీసుకొచ్చింది టీమిండియా. అయితే గాయం అయిన తర్వాత కూడా జడ్డూ మూడు బంతులు ఎదుర్కోవడం, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన చాహాల్ 3 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో ఈ విషయంలో వివాదం రేగింది.

అయితే గాయం తీవ్రం కావడంతో అతని గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ చేయాలని వైద్యులు నిర్ణయించడంతో మిగిలిన రెండు టీ20లకు జడ్డూ దూరం కానున్నాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన జడేజా గాయం కారణంగా తప్పుకోవడం భారత జట్టుకు పెద్ద దెబ్బే.