Asianet News TeluguAsianet News Telugu

ధోనీని ట్రోల్ చేసిన కేకేఆర్... కౌంటర్ ఇచ్చిన సీఎస్‌కే స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా...

యాషెస్ సిరీస్‌లో సిడ్నీ టెస్టు ఫోటోతో మాహీ బ్యాటింగ్‌ని ట్రోల్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... కౌంటర్ కామెంట్‌తో కేకేఆర్ నోరు మూయించిన రవీంద్ర జడేజా...

Ravindra Jadeja counter comment on KKR tweet, which trolls MS Dhoni batting in IPL
Author
India, First Published Jan 10, 2022, 9:40 AM IST

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందించింది. ఆఖరి రోజు ఆఖరి సెషన్, ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది ఇంగ్లాండ్ జట్టు. 91.2 ఓవర్లకు 237 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ తర్వాత కరెక్టుగా 100వ ఓవర్‌ ఆఖరి బంతికి జాక్ లీచ్ కూడా పెవిలియన్ చేరాడు....

ఆఖరి వికెట్ తీస్తే ఆస్ట్రేలియా జట్టు మరో విజయంతో 4-0 తేడాతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటుంది. క్రీజులో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. దీంతో ఆఖరి వికెట్ కోసం ఫీల్డర్లందరినీ బ్యాట్స్‌మెన్‌కి చుట్టుపక్కలే మోహరించాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...

బౌలర్‌, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్, నాన్- స్ట్రైయికర్‌తో సహా 9 మంది ఫీల్డర్లు కూడా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. జేమ్స్ అండర్సన్ ఆఖరి ఓవర్‌ ఎదుర్కొన్నప్పుడు బంతి బంతికీ ఉత్కంఠ రేగింది. ఈ ఫోటోను ఐపీఎల్ 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కీ లింకు పెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది కేకేఆర్...

రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మహేంద్ర సింగ్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో ధోనీని అవుట్ చేసేందుకు స్లిప్‌తో పాటు గల్లీ, షార్ట్ లెగ్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషన్లలో ఫీల్డర్లను మోహరించాడు అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్... ఈ ఫోటోను షేర్ చేసిన కేకేఆర్... ‘టెస్టు క్రికెట్‌లో ఓ క్లాసిక్ మూవ్, టీ20 మాస్టర్‌ స్టోక్‌ని గుర్తుకుతేవడం కొంచెం కొత్తగానే ఉంటుంది కదా...’ అంటూ కాప్షన్ జోడించింది...

2016లో కోల్‌కత్తాలో జరిగిన ఈ మ్యాచ్‌‌ను వర్షం కారణంగా ఓవర్లు కుదించి నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ 17.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. అజింకా రహానే 2, ఉస్మాన్ ఖవాజా 21, జార్జ్ బెయిలీ 33, సౌరబ్ తివారి 13, ఇర్ఫాన్ పఠాన్ 7, తిసారా పెరేరా 13 పరుగులు చేసి అవుట్ కాగా మహేంద్ర సింగ్ ధోనీ 22 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు, స్ట్రైయిక్ రేటు 36.36 మాత్రమే...

కేకేఆర్ లక్ష్యాన్ని 9 ఓవర్లలో 66 పరుగులుగా నిర్ణయించగా 5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. రాబిన్ ఊతప్ప 4, గౌతమ్ గంభీర్ డకౌట్ అయినా మనీశ్ పాండే 15, యూసఫ్ పఠాన్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. 

ఇన్‌డైరెక్ట్‌గా టీ20ల్లో ధోనీ బ్యాటింగ్ టెస్టుల్లో ఆడినట్టు ఉంటుందనే ఉద్దేశంతో, మాహీని ఆ రోజు ఓ ఆట ఆడుకున్నామనే అర్థం వచ్చింది ఉంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేసిన పోస్టు. దీనిపై సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన స్టైల్‌లో స్పందించాడు.

‘నిజానికి అది మాస్టర్ స్టోక్ కాదు, తొక్కా కాదు... లేన్ని దాన్ని చూపించుకోవడం...’ అంటూ కేకేఆర్ పోస్టుపై కామెంట్ చేశాడు జడ్డూ. కేకేఆర్ చేసిన ఈ పోస్టు కారణంగా సోషల్ మీడియాలో కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే, కేకేఆర్ వర్సెస్ మాహీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios