భారత క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించే జడ్డూ, బ్యాటింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడతాడు. ముద్దుగా ‘సర్ జడేజా’ అని పిలిపించుకునే జడ్డూ, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

రైనా, భజ్జీ గైర్హజరీతో ఇప్పుడు రవీంద్ర జడేజా పర్ఫామెన్స్‌, సీఎస్‌కేకి అత్యంత అవసరం. అందుకే సీజన్ ప్రారంభానికి ముందే రవీంద్ర జడేజాలో ఉత్సాహం పెంచేందుకు ఓ అవార్డును బహుకరించింది చెన్నై సూపర్ కింగ్స్. 

‘ది రాజ్‌పుత్ బాయ్’ అని రాసి ఉన్న ‘స్వర్ణ ఖడ్గం’ అవార్డుగా ఇచ్చింది సీఎస్‌కే. ‘ఐపీఎల్‌లో 100+ వికెట్లతో పాటు 1900+ పరుగులు చేసిన ఏకైక భారత ప్లేయర్.  అలాగే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ (108 వికెట్లు)’ అని రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు ఫోటోలను పోస్టు చేసిన జడేజా, చెన్నై సూపర్ కింగ్స్‌కు థ్యాంక్స్ తెలిపాడు.

 

 

‘ఇలాంటి అమేజింగ్ ఫ్రాంఛైసీతో ఆడడం ఓ గర్వంగా భావిస్తున్నా, ఓ గొప్ప అవకాశం. ఈ సీజన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు జడ్డ. ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్న రవీంద్ర జడేజా, అద్భుతమైన ఫీల్డర్ కూడా.