Ashwin Retired Out: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏం చేసినా చరిత్రే. గతంలో ‘మన్కడింగ్’ చేసినా ఇప్పుడు ‘రిటైర్డ్ ఔట్’ అయినా అవన్నీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారివే..

ఆటలోనే కాదు ఆటేతర విషయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. మరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా.. అతడు రిటైర్డ్ ఔట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవరైనా ఆటగాడు గాయపడితే దానిని రిటైర్డ్ హర్ట్ అంటారు. సదరు క్రికెటర్ మళ్లీ బ్యాటింగ్ కు రావొచ్చు. కానీ రిటైర్డ్ ఔట్ అంటే మాత్రం.. ఆటగాడు తన స్వంత నిర్ణయంగా పెవిలియన్ కు వెళ్లొచ్చు. అయితే సదరు ఆటగాడు తిరిగి క్రీజులోకి వచ్చే అవకాశం లేదు. లక్నోతో మ్యాచ్ లో అశ్విన్ ఈ సాహసానికే దిగాడు. 

లక్నో తో మ్యాచ్ లో 18వ ఓవర్లో మరో రెండు బంతులు మిగిలుండగా.. రిటైర్డ్ ఔట్ (అంపైర్ అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు) గా వెళ్లడంతో రియాన్ పరాగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ ఔట్ అయిన తొలి క్రికెటర్ రవిచంద్రన్ అశ్వినే కావడం గమనార్హం. 

Scroll to load tweet…

గతంలో అశ్విన్.. పంజాబ్ కింగ్స్ (2019) కు ఆడుతున్నప్పుడు ఇదే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో జోరు మీదున్న జోస్ బట్లర్ ను మన్కడింగ్ (బౌలర్ బంతి వేయకముందు బ్యాటర్ క్రీజు దాటితే బౌలర్ రనౌట్ చేయడం) చేశాడు. అప్పుడు అశ్విన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా మీడియా, ఆటగాళ్లకైతే ప్రపంచంలో ఇదే అతి పెద్ద సమస్య అన్నట్టుగా చిత్రీకరించారు. కాగా.. ఐపీఎల్ లో మన్కడింగ్ చేసిన తొలి ఆటగాడు అశ్వినే. 

రెండు సార్లూ అదే పేరు..

ఇక తాజాగా రిటైర్డ్ ఔట్ అయి ఐపీఎల్ లో ఇలా ఔట్ అయిన తొలి ఆటగాడిగా సంచలనం సృష్టించాడు అశ్విన్. ఈ రెండు సందర్భాలలో కామన్ గా వినిపించిన పేరు రాజస్థాన్ రాయల్స్. బట్లర్ ను మన్కడింగ్ చేసినప్పుడు అశ్విన్ కు రాజస్థాన్ ప్రత్యర్థి. ఇప్పుడేమో అదే జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇది యాదృశ్చికమో ఏమో గానీ.. అశ్విన్ కు రాజస్థాన్ రాయల్స్ కు విడదీయరాని అనుబంధం ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

అది జట్టు నిర్ణయం.. మా వ్యూహంలో భాగం : శాంసన్ 

ఇదిలాఉండగా అశ్విన్ రిటైర్డ్ ఔట్ అనేది జట్టు నిర్ణయమని, అది తమ వ్యూహంలో భాగమని రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ అన్నాడు. మ్యాచ్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ.. ‘మేము కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించాలనుకుంటున్నాం. అశ్విన్ రిటైర్డ్ ఔట్ అనేది జట్టు నిర్ణయం. అది మా వ్యూహంలో భాగం. సీజన్ కు ముందే ఇలాంటి వ్యూహాలకు సంబంధించి మేం ప్రణాళికలు వేసుకున్నాం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని వాడతాం...’ అని చెప్పుకొచ్చాడు. అయితే అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయినప్పుడు క్రీజులో ఉన్న మరో బ్యాటర్ షిమ్రన్ హెట్మెయర్ మాత్రం తనకు ఏం అర్థం కానట్టు చూశాడు. అతడికి ఈ విషయం తెలియదని శాంసన్ తర్వాత చావు కబురు చల్లగా చెప్పాడు.