టీమిండియాకు మరో స్టార్ ప్లేయర్ శాశ్వతంగాా దూరం ... ఆస్ట్రేలియాలోనే అశ్విన్ రిటైర్మెంట్
టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆయన రిటైర్మెంట్ పై బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
ఇండియన్ క్రికెట్ ప్రియులకు మరో ఛేదువార్త. మరో టీమిండియా క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్ళను బెంబేలెత్తించిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు... ఈ మేరకు బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) వెల్లడించింది.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటిస్తున్న టీమిండియాతో పాటే అశ్విన్ వున్నాడు. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ ఆడిన అశ్విన్ గబ్బా టెస్ట్ కు దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ఇవాళ(బుధవారం) వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ తో కలిసి మీడియాతో మాట్లాడిన అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
అశ్విన్ రిటైర్మెంట్ ను ప్రస్తావిస్తూ బిసిసిఐ ఆసక్తికర ట్వీట్ చేసింది. ''థ్యాంక్యూ అశ్విన్. తెలివి, మాయాజాలం, ప్రతిభ, వినూత్నతకు ప్రతీక అశ్విన్. టీమిండియా ఆల్‌రౌండర్, అద్భుతమైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అద్భుతంగా సాగిన నీ కెరీర్ ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు అశ్విన్'' అంటూ ఎక్స్ వేదికన స్పందించింది బిసిసిఐ.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యటక టీమిండియా చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. దీంతో ఈ సీరిస్ పలితాన్ని నిర్ణయించే గబ్బా మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. రసవత్తరంగా సాగుతున్న ఈ గబ్బా టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయ్యింది. అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించిన తర్వాత అశ్విన్ మైదానంలోకి అడుగుపెట్టారు. కెప్టెన్ రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా ఆటగాళ్లను హత్తుకున్నారు. హెడ్ కోచ్ గంభీర్ తో చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మీడియాముందుకు వచ్చి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తనకు సహకరించిన ఆటగాళ్లు, బిసిసిఐకి అతడు ధన్యవాదాలు తెలిపారు.
అశ్విన్ ఇంటర్నేషనల్ కెరీర్ :
రవిచంద్రన్ అశ్విన్ మంచి స్పిన్నర్ మాత్రమే కాదు కీలక సమయాల్లో బ్యాట్ మెన్ గా కూడా రాణించాడు. ఇలా బౌలర్ గా కెరీర్ ప్రారంభించి ఆల్ రౌండర్ గా ముగిస్తున్నారు. అతడు అంతర్జాతీయ స్థాయిలో 106 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. అందులో 537 వికెట్లు తీసాడు. ఇక వన్డేలో 156, టీ20 లో 72 వికెట్లు తీసాడు. మొత్తంగా అన్ని ఫార్మాట్స్ లో కలిపి 765 వికెట్లు పడగొట్టాడు.
బౌలర్ గానే కాదు బ్యాట్ మెన్ గా కూడా టీమిండియాకు భారీ పరుగులు అందించాడు అశ్విన్. టెస్ట్ క్రికెట్ లో ఏకంగా 3,503 పరుగులు చేసారు... అందులో ఆరు సెంచరీలు వున్నాయి. ఇలా టెస్టుల్లో అద్భుతంగా ఆడిన అతడు అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్ లు దక్కించుకున్నాడు.