మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టు... రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌట్ అయిన వెస్టిండీస్... ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియాకి ఘన విజయం..
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు, తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకి ఆలౌట్ కాగా,. తొలి ఇన్నింగ్స్‌లో 152.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ ఆధిక్యం దక్కగా వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి, 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకి ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.
7 పరుగులు చేసిన టగెనరైన చంద్రపాల్‌ని రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 7 పరుగులు చేసిన విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్, అశ్విన్ బౌలింగ్‌లో అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జర్మెన్ బ్లాక్‌వుడ్ 5, రేమన్ రిఫర్ 11, జోషువా డి సిల్వ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తొలి టెస్టు ఆడుతున్న అలిక్ అథనజే 44 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
13 పరుగులు చేసిన అల్జెరీ జోసఫ్ కూడా 13 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లోనే శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో ఓ ఫోర్ బాది 4 పరుగులు చేసిన రహ్కీమ్ కార్న్‌వాల్, అశ్విన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో కీమర్ రోచ్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తుదిజట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఘనమైన రీఎంట్రీ చాటుకున్నాడు. 108 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. అయితే కీమర్ రోచ్, జోమేల్ వర్రీకాన్ కలిసి ఆఖరి వికెట్‌కి 22 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
18 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన వర్రీకాన్‌ని అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా చేయడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌కి 130 పరుగుల వద్ద తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 7 వికెట్ల ప్రదర్శన నమోదుచేశాడు.
వెస్టిండీస్‌లో 4 సార్లు ఐదేసి వికెట్లు తీసిన అశ్విన్, అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, శుభాష్ గుప్తా మూడేసి సార్లు ఈ ఫీట్ సాధించారు.
టెస్టు కెరీర్‌లో అశ్విన్ ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీయడం ఇది 8వ సారి. ఈ విషయంలో అనిల్ కుంబ్లే (8 సార్లు మ్యాచ్‌లో పదేసి వికెట్లు) రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్‌లో ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఇంతకుముందు 2011లో ఇషాంత్ శర్మ 10 వికెట్లు తీయడమే బెస్ట్‌గా ఉండేది.
