Ravi Shastri Audi Car: భారత్ జట్టు చిరకాలం గుర్తుంచుకునే విజయాల్లో 1983 వన్డే ప్రపంచకప్ తర్వాత తప్పక చోటు దక్కించుకునే మ్యాచ్ 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్. పాకిస్తాన్ తో జరిగిన ఆ మ్యాచ్ లో భారత్.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అనదగ్గ మ్యాచులలో 1985లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ఫైనల్ ఒకటి. భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన రెండేండ్ల అనంతరం ఆడిన ఈ టోర్నీలో సునీల్ గవాస్కర్ సారథ్యంలోని భారత జట్టు పాక్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజయాన్ని అందుకోవడంతో పాటు టైటిల్ ను కూడా గెలుచుకుంది. అయితే ఈ టోర్నీ ఆసాంతం రాణించిన అప్పటి ఆల్ రౌండర్ రవిశాస్త్రి ఈ మ్యాచ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
‘1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించడానికి మాకు మరో 20 పరుగులు అవసరమున్నాయి. ఆ సమయంలో మాపై ఒత్తిడి పెంచడానికి ఆ జట్టు కెప్టెన్ జావేద్ మియందాద్.. ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు. మిడ్ వికెట్ వద్ద ఉన్న జావేద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు పదే పదే అక్కడే చూస్తున్నావ్.?
ఆ కారును మళ్లీ మళ్లీ చూస్తున్నావ్..? అది నీకు దక్కదు.. అని నన్ను స్లెడ్జింగ్ చేశాడు. దానికి కౌంటర్ గా నేను నేను కార్ ను చూడటం లేదు. ఆ కారే నావైపునకు చూస్తున్నది. అదే నా ఇంటికి వస్తానంటున్నది అని జావేద్ తో చెప్పా..’ అని రవిశాస్త్రి తెలిపాడు.
1985 లో నిర్వహించిన బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నీలో రవిశాస్త్రి.. టోర్నీ ఆసాంతం రాణించాడు. పాక్ తో ఫైనల్ మ్యాచ్ లో 62 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో అతడు.. 182 పరుగులు చేయడమే గాక 8 వికెట్లు కూడా తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డు గెలిచినందుకు గాను రవిశాస్త్రికి ప్రతిష్టాత్మక ఆడి కారు గెలుచుకున్నాడు.
ఫైనల్లో పాక్ పై గెలిచిన తర్వాత రవిశాస్త్రి గెలుచుకున్న కారుపై కూర్చుని టీమిండియా ఆటగాళ్లంతా సంబురాలు చేసుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించినా ఆడి కారుకే ఎక్కువ విలువ ఉంటుందని తెలిపాడు. రవిశాస్త్రి టీమిండియా తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983లో భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన జట్టులో శాస్త్రి సభ్యుడు.
