విరాట్ కోహ్లి టెస్టు రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి స్పందించారు. అతనికి ఇంకా ఆడే శక్తి ఉన్నా మానసికంగా అలసిపోయాడని అన్నారు.
టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విన్న తరువాత చాలా షాక్ అయ్యాయని అన్నారు. కోహ్లి ఇంకా రెండేళ్లు లేదా మూడేళ్ల వరకు ఈ ఫార్మాట్‌లో ఆడగల సత్తా ఉన్న ఆటగాడని భావించానని ఆయన స్పష్టం చేశారు.
విరాట్ ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందే తనతో మాట్లాడిన విషయాన్ని రవిశాస్త్రి వెల్లడించారు. రిటైర్మెంట్ నిర్ణయానికి సుమారు వారం రోజుల ముందు కోహ్లితో మాట్లాడినప్పుడు, అతడిలో ఓ స్పష్టత కనిపించిందని చెప్పారు. ఇక తాను దేశం కోసం చేయాల్సింది పూర్తయ్యిందని భావించినట్టుగా కోహ్లి స్పందించినట్లు వివరించారు. కోహ్లీకి ఈ నిర్ణయంలో ఎలాంటి అసంతృప్తి లేదని, అంతా తనంతట తానే స్పష్టతతో చేసుకున్న నిర్ణయమేనని అన్నారు.
ఇంకా టెస్టు ఫార్మాట్‌లో రాణించగలిగే సామర్థ్యం కోహ్లిలో ఉన్నప్పటికీ, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కోహ్లి ఆడే తీరే భిన్నంగా ఉంటుందని, అతను గ్రౌండ్‌లోకి అడుగుపెడితే మ్యాచ్‌ను పూర్తిగా తన భుజాలపై మోసేందుకు సిద్ధంగా ఉంటాడని చెప్పారు. అన్ని వికెట్లు తానే తీసుకోవాలని, క్యాచ్‌లు తానే పట్టాలని, ప్రతి నిర్ణయం తానే తీసుకోవాలనే తపన అతనిలో ఎప్పుడూ ఉండేదని అన్నారు.