ICC Rankings latest: జేమ్స్ అండర్సన్‌ని వెనక్కి నెట్టి, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్... 7 స్థానాలు ఎగబాకి, టాప్ 13లోకి విరాట్ కోహ్లీ... 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టాడు. టెస్టు సిరీస్‌లో 4 మ్యాచుల్లో 25 వికెట్లు, టాప్ వికెట్ టేకర్‌గా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన అశ్విన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా అవతరించాడు..

మూడేళ్లుగా ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్న ప్యాట్ కమ్మిన్స్, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు ముగిసిన తర్వాత తన పొజిషన్‌ని కోల్పోయాడు. 42 ఏళ్ల జేమ్స్ అండర్సన్, ఐసీసీ నెం.1 బౌలర్‌గా వారం రోజుల పాటు టాప్‌లో ఉన్నాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా అండర్సన్‌ని వెనక్కి నెట్టాడు...

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మళ్లీ తన ర్యాంకు మెరుగుపర్చుకున్న జేమ్స్ అండర్సన్, రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు.. తాజాగా అహ్మదాబాద్ టెస్టులో 7 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, 869 పాయింట్లతో అండర్సన్‌ని వెనక్కి నెట్టేశాడు...

జేమ్స్ అండర్సన్ 859 పాయింట్లతో రెండో పొజిషన్‌లో ఉంటే, ప్యాట్ కమ్మిన్స్ 841 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. కగిసో రబాడా 4, షాహీన్ ఆఫ్రిదీ ఐదో స్థానంలో ఉన్నాడు. గాయంతో టీమ్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా ఏడో స్థానానికి పడిపోగా, రవీంద్ర జడేజా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు...

అహ్మదాబాద్ టెస్టులో 186 పరుగులు చేసి, మూడేళ్ల తర్వాత సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... తన ర్యాంకుని 7 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. 2021 జనవరిలో నెం.1 టెస్టు బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, మెల్లిమెల్లిగా టాప్ 10 దాటి, టాప్ 19లోకి పడిపోయాడు..

అహ్మదాబాద్ టెస్టు ముగిసిన తర్వాత 7 స్థానాలు ఎగబాకి 13వ ప్లేస్‌కి వచ్చాడు విరాట్ కోహ్లీ. జూలై 2022లో టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుంచి పడిపోయిన విరాట్ కోహ్లీ, నాలుగు నెలల కాలంలో టాప్ 15లోకి రావడం ఇదే తొలిసారి. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ 9వ స్థానానికి పడిపోగా, రోహిత్ శర్మ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు...


టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తన టాప్ పొజిషన్‌ని కాపాడుకోగా రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నారు. అహ్మదాబాద్ టెస్టుకి ముందు టాప్ 5లో ఉన్న అక్షర్ పటేల్, టాప్ 4కి రాగా షకీబ్ అల్ హసన్ మూడు, బెన్ స్టోక్స్ ఐదో స్థానంలో ఉన్నారు..

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ తన నెం.1 పొజిషన్‌ని కాపాడుకున్నాడు. అయితే సిరాజ్ ఖాతాలో 729 పాయింట్లు ఉండగా జోష్ హజల్‌వుడ్ ఖాతాలో 727 పాయింట్లు ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ తన టాప్ పొజిషన్‌ని కాపాడుకోవాలంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించాల్సిందే...

శుబ్‌మన్ గిల్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 6లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ టాప్ 7లో, రోహిత్ శర్మ టాప్ 9లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌, ఈ ముగ్గురి ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపనుంది..