అడిలైడ్: అఫ్గనిస్తాన్ ఆటగాడు, ఐపిఎల్ సన్ రైజర్స్ క్రికెటర్ రషీద్ ఖాన్ కొత్తగా డిజైన్ చేసిన బ్యాట్ ను పరిచయం చేశాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ కు మధ్య ఆదివారం జరిగిన మ్యాచులో అతను ఆ బ్యాట్ ను ప్రవేశపెట్టాడు. 

ఆ బ్యాట్ కు cricket.com.au క్యామెల్ బ్యాట్ గా పేరు పెట్టింది. దాని వెనక భాగం వంపు తీసి ఉండడం వల్ల అలా పేరు పెట్టింది. అంటే, అది ఒంటెలాగా కనిపిస్తుందన్న మాట. 

రషీద్ ఖాన్ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు, రెండు సిక్స్ లు బాదాడు. దాంతో అడిలైడ్ స్ట్రైకర్స్ మెల్బోర్న్ రెనెగేడ్స్ పై 18 పరుగుల తేడాతో విజయం సాధించడానికి తోడ్పడ్డాడు. రషీద్ ఖాన్ వాడిన బ్యాట్ కు క్యామెల్ బ్యాట్ అని పేరు పెట్టి #BBL09 హ్యాస్ ట్యాగ్ ఇచ్చి ట్విట్టర్ లో పోస్టు చేసింది. 

దానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందించింది. దాన్ని ఐపిఎల్ 2020కి తీసుకుని రా అని రషీద్ ఖాన్ కు సూచించింది.