రాజ్ కోట్: టీమిండియా బ్యాట్స్ మన్ ఛతేశ్వర్ పుజారాను ఓపెనర్ శిఖర్ ధావన్ ఆట పట్టించాడు. టెస్టు బ్యాట్స్ మన్ గా మంచి గుర్తిం్పు పొందిన పుజారా తాజాగా తనకు మరో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. 

రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో సౌరాష్ట్ర కెప్టెన్ ఛతేశ్వర్ పుజారా బంతితో మెరిశాడు. అతను బౌలింగ్ చేయడమే కాకుండా ఓ వికెట్ కూడా తీశాడు. యూపీ బ్యాట్స్ మన్ మోహిత్ జంగ్రాను తన లెగ్ స్పిన్ తో అవుట్ చేశాడు. ఇది రెండో రోజు ఆటలో విశేషంగా నిలిచింది. 

దీనికి సంబంధించిన ఫొటోను పుజారా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. తాను బ్యాట్స్ మన్ నుంచి ఆల్ రౌండర్ గా ఎదిగానని సరదా వ్యాఖ్య పెట్టాడు. పుజారా వికెట్ తీయడంపై జట్టు సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. 

శిఖర్ ధావన్ మాత్రం పుజారాను ట్రోల్ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేశావని, నీ పరుగుల వేగానికి స్ప్రింటర్ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడని ఆట పట్టించాడు. అసాధారణంని, ఇక మరింతగా బౌలింగే చేసే సమయం వచ్చిందని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.

పుజారాను ఉద్దేశించి ధావన్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పుజారా ఇప్పటి వరకు ఆరు వికెట్లు తీశాడు.