Asianet News TeluguAsianet News Telugu

ధావన్ సారథ్యంలో సఫారీలతో వన్డే సిరీస్.. రజత్ పాటిదార్‌తో పాటు ముఖేష్ కుమార్‌కూ చోటు

India Squad For SA Series: సఫారీలతో  పొట్టి ఫార్మాట్ లో సిరీస్ ముగిశాక భారత జట్టు మూడు వన్డేలు కూడా ఆడనుంది.  ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. రజత్ పాటిదార్ తో పాటు ముఖేశ్ కుమార్ లకు జట్టులో చోటు దక్కించుకున్నారు. 

Rajat Patidar and Mukhesh Kumar gets Maiden India Cap, Shikhar Dhawan To Lead Team For SA ODI Series
Author
First Published Oct 2, 2022, 7:36 PM IST

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక ప్రారంభం కానున్న వన్డే సిరీస్  కోసం  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు  శిఖర్ ధావన్ సారథ్యం వహించనుండగా శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు.   గత కొంతకాలంగా  దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో రాణిస్తున్న రజత్ పాటిదార్, బౌలర్ ముఖేష్ కుమార్ లు తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యారు.   ఈ సిరీస్ లో సంజూ శాంసన్ ను వైస్ కెప్టెన్ చేస్తారని ఊహాగానాలు వినిపించినా  సెలక్టర్లు మాత్రం అతడిని వికెట్ కీపర్ పాత్రకే పరిమితం చేశారు. 

రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టు  అక్టోబర్  4న ఇండోర్ లో  దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ముగిశాక ఈనెల 6న ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లనున్నది. అయితే 6 నుంచి  11 వరకు ప్రొటీస్ టీమ్ తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. 

ధావన్ సారథ్యంలోని భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్,  శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లు బ్యాటర్లు కాగా షాబాజ్ అహ్మద్,  షార్దుల్ ఠాకూర్ లు ఆల్ రౌండర్లుగా ఉన్నారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లను ఎంపిక చేసిన సెలక్టర్లు.. పేసర్లుగా అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ లతో పాటు ముఖేష్ కుమార్ కు అవకాశం కల్పించారు.  బుమ్రాకు గాయమైన నేపథ్యంలో  షమీని సౌతాఫ్రికాతో ఆడిస్తారని అనుకున్నా సెలక్టర్లు మాత్రం అలాంటిదేమీ చేయలేదు. 

కొత్తగా జట్టులోకి వచ్చిన వారిలో ముఖేష్ కుమార్ బెంగాల్‌కు చెందిన బౌలర్. 2015-16 రంజీ సీజన్ లో  బెంగాల్ తరఫున ఎంట్రీ ఇచ్చిన అతడు.. 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 109 వికెట్లు తీశాడు. 2016 నుంచి 17 టీ20లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు.  ఇక రజత్ పాటిదార్.. అటు రంజీలతో పాటు ఐపీఎల్ లో కూడా అదరగొట్టిన రజత్ పాటిదార్  ఎంపికవడంతో భారత బ్యాటింగ్ బలం మరింత పెరగనుంది.  

 

ఇదిలాఉండగా ఈ జట్టులో ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ లు  ప్రపంచకప్ లో స్టాండ్ బై ప్లేయర్లుగా  ఎంపికైనవారే. వీళ్లంతా  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ (అక్టోబర్ 11) ముగిశాక ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నారు. అక్టోబర్ 17న భారత్.. ఆస్ట్రేలియాతో  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. 

టీ20  ప్రపంచకప్ కు వెళ్లే రోహిత్ సేనతో కలిసి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఆస్ట్రేలియా వెళ్లునుండటంతో ఈ సిరీస్ లో భారత్ కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తాడు. 

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:  శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ 

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ షెడ్యూల్ : 
- తొలి వన్డే  : అక్టోబర్ 6 - రాంచీ
- రెండో వన్డే : అక్టోబర్ 9 - లక్నో 
- మూడో వన్డే : అక్టోబర్ 11 - ఢిల్లీ 
 

Follow Us:
Download App:
  • android
  • ios