మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కాకముందే... రాజస్థాన్ రాయల్స్ కి ఎదురుదెబ్బ తగిలింది.  ఆ జట్టు పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

గాయం నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆటకు దూరమైన ఆర్చర్.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కూడా ఒకే మ్యాచ్ ఆడాడు. మిగతా మూడు టెస్ట్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాగే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

సౌతాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వచ్చిన ఆర్చర్‌కు బుధవారం స్కానింగ్ తీయగా.. అతని కుడి ఎల్బోలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతను మరో మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతోనే ఆర్చర్ అపకమింగ్ శ్రీలంక టూర్‌తో పాటు ఐపీఎల్‌కు దూరంకానున్నాడు. మళ్లీ అతను జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read అండర్ 19 ప్రపంచ కప్: ఫైనల్లో ఇండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్...

టైటిలే లక్ష్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గాయంతో గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ వ్యూహాలను దెబ్బతీసింది. గత సీజన్‌లో జోఫ్రా అద్భుత ప్రదర్శన‌తో ఆకట్టుకున్నాడు. ఓవర్‌కు 6.76 పరుగుల చొప్పున ఇచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. 

ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని అద్భుత బౌలింగ్ జట్టు విజయాలకు కలిసొచ్చింది. దీంతో ఆర్చర్‌ను ఈ సీజన్‌కు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. మరోసారి అతని నుంచి అదే ప్రదర్శనను ఆశించింది. కానీ టోర్నీ మొదలవ్వకుండానే గాయంతో ఆర్చర్ సేవలను కోల్పోయింది.