ఈ వర్షం సాక్షిగా.. ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్లకు వరుస షాకులు.. టోర్నీ నిర్వాహణపై విమర్శలు

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ట్రోఫీని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అగ్రశ్రేణి జట్లకు వరుణుడు ఊహించని షాకులు ఇస్తున్నాడు. 
 

Rain Playing Spoilsport in T20 World  Cup 2022, Big Teams Worrying

ఆస్ట్రేలియాలో  జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  వర్షం వల్ల  రద్దవుతున్న మ్యాచ్ ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జరిగిన  అర్హత మ్యాచ్ లు, వార్మప్ మ్యాచ్ లలో  వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు.  వర్షం కారణంగా పలు మ్యాచ్ లు రద్దయ్యాయి. ఇక సూపర్-12 ప్రారంభమయ్యాక  వర్షాలు అగ్రశ్రేణి జట్లకు వరుస షాకులిస్తున్నాయి.  వర్ష బాధితుల్లో తప్పక ఉండే దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్  ఇప్పటికే ఈ జాబితాలో చేరగా  గురువారం నెదర్లాండ్స్ వేదికగా  జరుగబోయే మ్యాచ్ లో కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తుండటంతో తర్వాత బాధిత దేశం ఇండియానే కానుంది. 

సూపర్-12లో భాగంగా ఈనెల 24న  జింబాబ్వే-సౌతాఫ్రికా మధ్య  మ్యాచ్ జరిగింది. వర్షం వల్ల రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన  మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు. జింబాబ్వే బ్యాటింగ్ చేసినప్పుడు  వర్షం రాలేదు. కానీ సఫారీలు బ్యాటింగ్ చేసే సమయంలో రెండు సార్లు వర్షం పడింది. 

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, కివీస్ బలి.. 

జింబాబ్వే నిర్దేశించిన 80 పరుగుల లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన సఫారీలు.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం  మరో 13 పరుగులు చేస్తే విజయం దక్కేదే. కానీ మూడు ఓవర్ల ఆట కాకముందే వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపించాడు. దీంతో  మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. 

బుధవారం ఇంగ్లాండ్ - ఐర్లాండ్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అప్పుడు వర్షం కురిసే అవకాశమేమీ కనిపించలేదు. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు వచ్చి  14 ఓవర్ల ఆట ముగిశాక వరుణుడు హాయ్ చెప్పాడు.  దీంతో ఆటగాళ్లంతా  పెవిలియన్ కు చేరారు.  కొద్దిసేపు విరామం ఇచ్చిన ఆటకు మళ్లీ ప్రారంభిస్తారని భావించినా వర్షం తగ్గకపోవడంతో  ఆటను రద్దు చేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలిచింది. 

 

ఇదే గ్రౌండ్ లో న్యూజిలాండ్ - అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది.  కనీసం టాస్ కు కూడా రాకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇరు జట్లకు తలా ఓ పాయింట్ దక్కింది. 

భారత్ కూ తప్పదా..?

పాకిస్తాన్ తో చారిత్రాత్మక విజయం తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ ను  గురువారం నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. సిడ్నీ వేదికగా జరగాల్సి ఉన్న ఈ మ్యాచ్ లో కూడా వర్షం ముప్పు ఉందని  సమాచారం. ఇదే జరిగితే  భారత్  కూడా వరుణుడి బాధితుల్లో చేరనుంది.  

 

రిజర్వ్ డే లేదు.

వర్షం వల్ల వరుసగా మ్యాచ్ లు రద్దవుతుండటంతో టోర్నీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆస్ట్రేలియాలో ప్రస్తుతం  వింటర్ సీజన్.  వానలు పడుతాయని తెలిసినా ఐసీసీ ఈ టోర్నీని ఇప్పుడు ఎందుకు నిర్వహించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక ప్రపంచకప్ లో సెమీస్, ఫైనల్స్ కు తప్ప మిగతా  మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు.  

వర్షం వల్ల చిన్న జట్లకు  పాయింట్లు దక్కుతున్నా అగ్రశ్రేణి జట్లకు మాత్రం  షాకులు తగులుతున్నాయి.  టోర్నీ ప్రారంభంలోనే కీలక పాయింట్లు కోల్పోతే చివరి వరకు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.  సూపర్ - 12లో   రెండు గ్రూపుల నుంచి టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ కు చేరతాయి.  సెమీస్ చేరే క్రమంలో మ్యాచ్ పాయింట్లు, నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తాయి.  ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావం  సెమీస్ కు చేరే జట్ల మీద కూడా పడతాయనడంలో సందేహం లేదు. ఇది అగ్రశ్రేణి జట్లకు మరింత భయం పట్టుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios