ఆసీస్‌లో ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే ఇలాగే ఆడాలి మరి.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో వరుణుడు విలన్ గా తేలుతున్నాడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్ లు రద్దవడంతో నాలుగు జట్ల సెమీస్ అవకాశాల మీద ప్రభావం చూపనున్నాయి.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో పలు జట్లకు తమ ప్రత్యర్థి కంటే శత్రువు మరో రూపంలో ఎదురవుతున్నాడు. ఆ శత్రువు ఎవరో కాదు.. వరుణుడు. కీలక సందర్భంలో కుండపోతలా కురుస్తూ మ్యాచ్ లు జరుగకుండా అడ్డుకుంటున్న వరుణదేవుడు.. అగ్రశ్రేణి జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగించగా.. శుక్రవారం జరగాల్సిన గ్రూప్-ఏ మ్యాచ్ లు రెండూ వర్షార్పణమయ్యాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టోర్నీ నిర్వాహకులపై జోకులు పేలుతున్నాయి. ఇది వర్షాలు కురిసే సమయమని తెలిసి కూడా ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సీజన్ లో టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నదని ప్రశ్నిస్తున్నారు.
ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాను దారుణంగా ట్రోల్ చేస్తూ మీమ్స్ తో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లలో పలువురు చేస్తున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఒక సముద్రం లోపల బ్యాటర్, వికెట్ కీపర్ లు ఆక్సిజన్ మాస్కులు ధరించి క్రికెట్ ఆడుతున్న ఫోటో ట్విటర్ లో వైరల్ గా మారింది. దాంతో పాటు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీపై వాన పడకుండా గొడుగు పడుతున్న ఫోటో కూడా వైరల్ గా మారింది.
ఫోటోలు, మీమ్స్ తో పాటు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇక నుంచి ప్రతీ సారి టీ20 ప్రపంచకప్ ను రాజస్తాన్ లో నిర్వహించండి.. ఇక్కడ మీరు కురవమని వరుణయాగాలు చేసినా వానలు పడవు. మ్యాచ్ లకు అంతరాయం కలగదు. ఎందుకంటే మాకు ఇక్కడ వర్షాలు పడే ఛాన్సెస్ చాలా తక్కువ..’ అని ట్వీట్ చేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. ‘వాతావరణం బాగోలేకున్నా అసలు ఐసీసీ ఈ మ్యాచ్ లను ఆస్ట్రేలియాలో ఎందుకు నిర్వహిస్తున్నదో అర్థం కావడం లేదు. కొన్ని మ్యాచ్ లు ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడటం లేదు. మరికొన్ని మ్యాచ్ లలో టాస్ కూడా పడటం లేదు. కీలక మ్యాచ్ లలో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతలు మారుతున్నారు..’ అని ట్వీట్ చేశాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు వర్షం వల్ల రద్దైన మ్యాచ్ లు..
- సూపర్-12 కు ముందు వర్షం కారణంగా పలు ప్రాక్టీస్ మ్యాచ్ లు రద్దయ్యాయి. కానీ అసలు టోర్నీ మొదలయ్యాక కూడా వరుణడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. అందులో ప్రధానంగా..
- జింబాబ్వే - సౌతాఫ్రికా మ్యాచ్ కొద్దిసేపు జరిగినా వర్షం కారణంగా ఫలితం తేలలేదు.
- ఐర్లాండ్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం కురిసింది. దీంతో ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో) ఓడింది.
- న్యూజిలాండ్ - అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయింది.
- ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు.
- ఐర్లాండ్ - అఫ్గాన్ ల మధ్య మ్యాచ్ రద్దు.
అయితే వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దవడం అగ్రజట్లకు భారీ షాకులిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1లో ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా కూడా సెమీస్ రేసులో వెనుకబడ్డాయి. ఈ రెండు జట్లు తర్వాత జరుగబోయే రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో విజయాలు సాధిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. ఇక ఒక మ్యాచ్ లో ఓడి రెండింటిలో వర్షార్పణం కారణంగా అఫ్గాన్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. కానీ ఐర్లాండ్ కు సెమీస్ చేరే అవకాశాలున్నాయి. కానీ దాని అదృష్టం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఆడే మ్యాచ్ ల మీద ఆధారపడి ఉంటుంది.