టీమిండియాతో దోబూచులాటాడిన వరుణుడు... ఐదో రోజు సాగని ఆట! డ్రాగా ముగిసిన రెండో టెస్టు..
వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయిన ఐదో రోజు ఆట.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు! 1-0 తేడాతో సిరీస్ టీమిండియా కైవసం..

రెండో టెస్టులో ఓడించి, వెస్టిండీస్‌పై 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలవాలనుకున్న టీమిండియా కలలు నెరవేరలేదు. వర్షం కారణంగా రెండో టెస్టు ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండా ఆట రద్దయ్యింది. పలుమార్లు వర్షం తగ్గడం, మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ప్రారంభం అవుతుందనగా మళ్లీ జోరుగా వాన కురవడం సాగాయి. ఇలా ఆఖరి సెషన్ వరకూ ఎదురుచూసిన అంపైర్లు, ఇక ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీమిండియా 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ని సొంతం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి వ్యక్తిగత ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన మహ్మద్ సిరాజ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టెస్టు డ్రా కావడంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో టీమిండియాకి ఇదే మొట్టమొదటి సీజన్. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచి 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ అందుకున్న టీమిండియా, రెండో టెస్టులోనూ గెలిచి ఉంటే దాన్ని 100గా కాపాడుకోగలిగి ఉండేది. రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియాకి 33.33 శాతం పాయింట్లు మాత్రమే వస్తాయి. దీంతో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 66.66కి పడిపోయింది...
ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐదు నెలల వరకూ టెస్టు క్రికెట్ ఆడడం లేదు భారత జట్టు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్, ఆసియా కప్ 2023, ఆసియా క్రీడలు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలతో వైట్ బాల్ క్రికెట్ షెడ్యూల్‌తో యమా బిజీగా గడపనుంది టీమిండియా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా, అక్కడ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. గత పర్యటనలో మూడు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా, ఈ సారి బిజీ షెడ్యూల్ కారణంగా ఓ టెస్టు మ్యాచ్ తగ్గించుకుంది. సౌతాఫ్రికాలో ఇంతవరకూ టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు, 2021-22 పర్యటనలోనూ 2-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడింది..
సౌతాఫ్రికా పర్యటన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు...