India Squad For Ireland: ఐర్లాండ్ పర్యటన కోసం భారత క్రికెట్ బోర్డు తాజాగా జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో చోటు దక్కిన, దక్కని ఆటగాళ్లు ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని, బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల చివర్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. అంతగా ప్రాధాన్యం లేని ఈ సిరీస్ కోసం సెలక్టర్లు సంచలనాలేమీ చేయలేదు. కానీ టీమిండియాలో చోటు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న పలువురు ఆటగాళ్లకు మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఐపీఎల్ లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న రాహుల్ త్రిపాఠికి టీమిండియాలో చోటు దక్కగా.. రాహుల్ తెవాటియా, పృథ్వీ షా వంటి ఆటగాళ్లకు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో వాళ్లు స్పందిచారు.
ఎట్టకేలకు జట్టులోకి ఎంపికవడం పై రాహుల్ త్రిపాఠి స్పందిస్తూ.. ‘ఇది చాలా పెద్ద అవకాశం. నా కల నిజమైంది. నన్ను నేను అభినందించుకోవాలి. సెలక్టర్లు నామీద నమ్మకముంచినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను.
జట్టులోకి ఎంపికయ్యే అవకాశమైతే దక్కింది గానీ దు తుది జట్టులో నాకు ఆడే అవకాశమిస్తే నన్ను నేను నిరూపించుకుంటా. వంద శాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా..’ అని త్రిపాఠి అన్నాడు. ఐపీఎల్ లో 2018, 2019 సీజన్లలో రాజస్తాన్ తరఫున ఆడాడు. ఆ తర్వాత రెండేండ్లు కేకేఆర్ కు ఆడాడు. ఇక ఇటీవల ముగిసిన 15వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి 14 మ్యాచులలో 413 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదిలాఉండగా టీమిండియాలో స్థానం ఆశించిన మరో ఔత్సాహిక క్రికెటర్ రాహుల్ తెవాటియా. త్రిపాఠి మాదిరిగానే తెవాటియా కూడా గత కొంతకాలంగా దేశవాళీ తో పాటు ఐపీఎల్ లో నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన తెవాటియా.. 12 ఇన్నింగ్స్ లలో 217 రన్స్ చేశాడు. ఫినిషర్ గా సేవలందిస్తున్న తెవాటియా కు కూడా జాతీయ జట్టులో స్థానం ఖాయమని అనుకున్నారు అభిమానులు. కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయే చూపారు. ఈ నేపథ్యంలో అతడు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అంచనాలు బాధించాయి’ అని ట్వీట్ చేశాడు.
ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ను కూడా జట్టులోకి తీసుకోకపోవడంపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. షా ను ప్రతి సిరీస్ లో పక్కనబెట్టడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతడికి సానుభూతిగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
జూన్ 26, 28న ఇండియా.. ఐర్లాండ్ తో రెండు టీ20 లు ఆడనుంది. ఈ మేరకు ప్రకటించిన జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండనుండగా భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
