ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సక్సెస్‌ఫుల్ కోచ్ గా పేరుతెచ్చుకున్న రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం ముగిసింది.  భారత్-ఏ, అండర్ 19 జట్లకు గత నాలుగేళ్లుగా చీఫ్ కోచ్ గా వ్యవహరించి ద్రవిడ్ ఇటీవలే ఆ పదవిని కోల్పోయాడు. అయితే తాజాగా అతడిస్థానంలో ఇద్దరు కోచ్ లను నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. 

ఇంతకాలం భారత్-ఏ, అండర్ 19 జట్లకు ద్రవిడ్ ఒక్కరే  కోచ్ గా వ్యవహరించారు. కానీ తాజాగా భారత్-ఏ ప్రధాన కోచ్ గా సీతాన్షు కొటక్,  అండర్ 19 చీఫ్ కోచ్ గా పారస్ మాంబ్రోను ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు కేవలం రెండు నెలలపాటే ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఆ తర్వాత శాశ్వతంగా కోచ్ లను నియమించనున్నట్లు బిసిసిఐ వెల్లడించింది. 

పరస్పర విరుద్ద ప్రయోజనాల కలిగివున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల బిసిసిఐ ద్రవిడ్ ను విచారించింది. బోర్డు అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ ఎదుట ద్రవిడ్ హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని కేవలం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా మాత్రమే కొనసాగించాలని అంబుడ్స్ మెన్ బిసిసిఐని ఆదేశించింది. ఇలా భారత్-ఏ, అండర్ 19 కోచ్ పదవులను ద్రవిడ్ కోల్పోవాల్సి వచ్చింది. 

2015 లో భారత జూనియర్ క్రికెట్ జట్ల కోచింగ్ బాధ్యతను ద్రవిడ్ స్వీకరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయన పర్యవేక్షణలో యువ క్రికెటర్లు మెరికల్లాగ తయారయ్యారు. ఇలా అత్యుత్తమ ప్రదర్శనను బయటకు రాబట్టడంలో ద్రవిడ్ కృషి మరిచిపోలేనిది. ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ  క్రికెటర్లుగా రాణిస్తున్న చాలామంది యువ క్రికెటర్లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే రాటుదేలారు. ఇక శుభ్ మన్ గిల్ వంటి యువకులు ద్రవిడ్ ను కోచ్ గానే కాకుండా దైవసమానంగా భావిస్తున్నారు. 

 గతంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన దిగ్గజాలు సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు కూడా ఇలాగే విరుద్ద ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. తదనంతర పరిణామాలతో ఈ దిగ్గజాలు సీఏసీ నుంచి వైదొలగడంతో కొత్తగా సీఏసీకి విఖ్యాత మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లను నియమించారు.