Asianet News TeluguAsianet News Telugu

Rishabh Pant: పంత్ సెంచరీ.. ఎగిరి గంతేసిన హెడ్ కోచ్.. వీడియో వైరల్

ENG vs IND: అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ పరువు నిలిపిన  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.  

Rahul Dravid celebrates Rishabh Pant Century In Edgbaston Test, Watch Video
Author
India, First Published Jul 1, 2022, 11:24 PM IST

మిన్ను విరిగి మీద పడ్డా  కాస్త కూడా చలించని వారి జాబితా తీస్తే అందులో తొలి వరుసలో ఉంటాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. మిగతా కోచ్ ల మాదిరి ఎవరైనా ఆటగాడు సెంచరీ చేస్తేనో.. వికెట్ తీస్తేనో నానా హంగామా చేసే రకం కాదు ద్రావిడ్. ఒక చిన్న నవ్వు నవ్వి (అది కూడా కష్టంగా)  ఊరుకుంటాడే తప్ప అతడి నుంచి విరాట్ కోహ్లి లెవల్ లో సెలబ్రేషన్ ను ఆశించడం  కూడా కష్టమే. అంత కామ్ గా ఉండే ద్రావిడ్.. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం ఎగిరిగంతేశాడు. ద్రావిడ్ లో ఈ అనూహ్య మార్పునకు కారణం రిషభ్ పంత్. 

ఎడ్జబాస్టన్ టెస్టులో రిషభ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ ద్రావిడ్.. పెవిలియన్ లో  తన సీట్ లో కూర్చున్నవాడు  కాస్తా లేచి సంతోషంగా నవ్వుతూ చేతులు పైకెత్తుతూ పంత్ ను ఎంకరేజ్ చేశాడు. సాధారణంగా రాహుల్ ద్రావిడ్ నుంచి ఈ తరహా సెలబ్రేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. 

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో రవీంద్ర జడేజా తో కలిసి  ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించాడు పంత్. 89 బంతుల్లో సెంచరీ  పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఇన్నింగ్స్ లో 111 బంతులాడి 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు.  

కాగా వరుసగా వికెట్లు కోల్పోయి అసలు 200 పరుగులైనా చేస్తామా..? అన్న స్థితి నుంచి ఏకంగా భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపినందుకు గాను రాహుల్ ద్రావిడ్ కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు. పంత్ సెంచరీ పూర్తి కాగానే తన సీట్లోంచి లేచి మనస్పూర్తిగా నవ్వుతూ రిషభ్ ను అభినందించాడు. పంత్ సెంచరీ చేసిన సమయంలో పెవిలియన్ అంతా చప్పట్లతో మార్మోగింది.  రాహుల్ ద్రావిడ్ సెలబ్రేషన్ వీడియో  ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

కాగా ఈ మ్యాచ్ లో పంత్ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కీలక సమయంలో  అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని  రిషభ్ ను మాజీ క్రికెటర్లు, టీమిండియా అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.  పంత్ తో పాటు అతడికి సహకరించిన రవీంద్ర జడేజా కృషిని కూడా కొనియాడుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios