టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ఈసారి తన ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఓటరు జాబితాలో ఆయన పేరు లేకపోవడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే.. రాహుల్ ద్రావిడ్ గతంలో తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేవారు.

ఈ ప్రాంతం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కొద్దిరోజుల క్రితం ద్రవిడ్ మల్లేశ్వరం ప్రాంతంలోని కొత్త ఇంటికి మకాం మార్చారు. ఇది బెంగళూరు నార్త్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

ఈ క్రమంలో పాత నియోజకవర్గం ఓటరు జాబితా నుంచి రాహుల్ పేరును తొలగించాలని ఆయన సోదరుడు ఎన్నికల అధికారులకు ఫారం-7ను అందజేశారు. అయితే కొత్త నియోజకవర్గంలో తన పేరును చేర్చాల్సిందిగా ఓటరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే నాటికి గడువులోగా రాహుల్ పత్రాలు సమర్పించలేకపోయారు. దీనిపై ఎన్నికల అధికారులు రాహుల్ ఇంటికి పలుమార్లు వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.

దీనిపై రాహుల్ పీఏ మాట్లాడుతూ.. ద్రవిడ్ తన పాత నియోజకవర్గంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలను కుంటున్నారని తెలిపారు. అయితే ఫారం -7 సమర్పించడంతో అధికారులు ఆయన ఓటును తొలగించేశారు. దీంతో రాహుల్ పేరు ఓటరు జాబితాలో లేకుండా పోయింది.

మరోవైపు ఆయనను ఎన్నికల సంఘం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఓటు హక్కు గురించి ద్రవిడ్ సందేశమిస్తున్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కానీ చివరకు ఆయనకే ఓటు లేకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.