Australia Open Final: ఆదివారం రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన ఫైనల్ లో రఫెల్ నాదల్.. రెండో సీడ్ మెద్వదేవ్ పై  హోరాహోరి  పోరులో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే..

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. హోరాహోరి పోరులో ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డానిల్ మెద్వదేవ్ (రష్యా) తో ఆదివారం ఐదున్నర గంటల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని మునివేళ్ల మీద కూర్చుండబెట్టిన మ్యాచులో గెలిచిన నాదల్.. మ్యాచ్ ముగిశాక అమాంతం కింద పడిపోయాడు. ఏకబిగిన ఐదున్నర గంటలు ఆడేసరికి అలిసిన నాదల్.. అలసటకు తాళలేక డ్రెస్సింగ్ రూమ్ కు రాగానే అక్కడి కుప్పకూలిపోయాడు. 

ఆదివారం రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన ఫైనల్ లో రఫెల్ నాదల్.. 2-6, 6-7, (5/7), 6-4, 6-4, 7-5 తో రెండో సీడ్ మెద్వదేవ్ పై హోరాహోరి పోరులో విజయం సాధించాడు. ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచులో నాదల్, మెద్వదేవ్ కొదమసింహాల్లా పోరాడారు. తొలి రెండు సెట్ లు కోల్పోయినా నాదల్ మాత్రం పోరాటాన్ని వీడలేదు. తన కెరీర్ లో గడించిన అపార అనుభవాన్ని రంగరించి పాయింట్ల కోసం పోరాడాడు. ఆద్యంతం ఆధిక్యం మారుతూ వచ్చిన మ్యాచులో చివరికి నాదల్ నే విజయం వరించింది. 

అయితే మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన నాదల్.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కప్పు తీసుకున్న అనంతరం అక్కడ నిల్చోడానికి కూడా నాదల్ ఇబ్బంది పడ్డాడు. మీడియా సమావేశానికి వెళ్లడానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి అక్కడే కింద పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి సహాయక సిబ్బంది నాదల్ కు సాయపడ్డారు. అనంతరం నాదల్.. ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించాడు. 

Scroll to load tweet…

నాదల్ కొత్త చరిత్ర : 

ఆధునిక ప్రపంచ టెన్నిస్ చరిత్రలో పురుషుల టెన్నిస్ లో దిగ్గజ త్రయంగా గుర్తింపు పొందిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జొకొవిచ్ లలో నాదల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫైనల్స్ కు ముందు వరకు ఈ ముగ్గురు తమ కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ లతో సమానంగా ఉన్నారు. ఈ టోర్నీ కి ముందు.. జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి నాదల్, ఫెదరర్ ను అధిగమిస్తాడని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. కరోనా వ్యాక్సిన్, కొవిడ్ మార్గదర్శకాలు పాటించనందున ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిని టోర్నీ నుంచి బహిష్కరించింది.

మరోవైపు ఈ టోర్నీకి ముందు నాదల్ పై ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఒక్కో రౌండ్ గెలుస్తూ ఫైనల్స్ వచ్చిన నాదల్.. అసమాన పోరాటంతో రెండో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. 2010 తర్వాత ఈ టోర్నీ నెగ్గడం అతడు ఇదే తొలి సారి. 2012లో ఫైనల్స్ కు వచ్చినా ఆ మ్యాచులో జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. కాగా నాదల్ రికార్డును ఇప్పట్లో అధిగమించే ఆటగాళ్లలో జొకోవిచ్ ఒక్కడే ముందు వరుసలో ఉన్నాడు. అతడు కూడా సాధించకుంటే టెన్నిస్ ప్రపంచంలో ఈ స్పెయిన్ బుల్ కింగ్ గా నిలువనున్నాడు.