174 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, 90 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, 60 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్... బంగ్లాదేశ్ ముందు 383 పరుగుల భారీ టార్గెట్.. 

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఊహించని పరాజయం తర్వాత సౌతాఫ్రికా మళ్లీ సూపర్ ఫామ్‌లో దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌పై 229 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న సౌతాఫ్రికా... ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. 

రీజా హెండ్రిక్స్ 12, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా.. ఈ దశలో క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్‌తో కలిసి మూడో వికెట్‌కి 131 పరుగులు జోడించారు. అయిడిన్ మార్క్‌రమ్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్వింటన్ డి కాక్ 101 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో క్వింటన్ డి కాక్‌కి ఇది మూడో సెంచరీ. క్వింటన్ డి కాక్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి నాలుగో వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, హసన్ మహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్ కూడా హసన్ మహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..