ఈ మధ్యకాలంలో కరెంట్  బిల్లులపై సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా మండిపడటం ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీతారలు.. తమకు ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లులు వచ్చాయంటూ అధికారులపై మండిపడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరిపోయారు.

తన ఇంటికొచ్చిన కరెంటు బిల్లు చూసి టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ప్రతి నెలా తాము చెల్లించేదానికన్నా.. ఏడింతలు ఎక్కువగా కరెంట్ బిల్లు వచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు. ముంబై ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఈ నెల కరెంటు బిల్లు రూ.33,900 వచ్చినట్లు తెలిపాడు. ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన కరెంట్‌ బిల్‌ మెసేజ్‌ను భజ్జీ శనివారం ట్విటర్‌లో పోస్టు చేశాడు. తమ వీధిలోని అందరి కరెంట్ బిల్లు తనకే వేశారేమో అంటూ సెటైర్ కూడా వేశాడు.

 

'ముంబై ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ మా చుట్టుపక్కల వాళ్లందరి కరెంట్‌ బిల్‌ కూడా నాకే ఇచ్చినట్టుంది. ముంబై ఆదాని అలెర్ట్: 152857575 సర్వీస్ నంబర్ కరెంట్‌ బిల్‌ రూ. 33900.00 చెల్లించాల్సి ఉంది. సాధారణ బిల్ కంటే ఏడింతలు ఎక్కువ. వావ్' అని హర్భజన్‌ సింగ్‌ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో భజ్జీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. ఇటీవల హీరోయిన్ తాప్సీ, శ్రద్ధాదాస్, కార్తీక వంటి హీరోయిన్లందరూ తమకు ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లు రావడాన్ని సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే.