సారాంశం
Wrestlers Protest: నెల రోజులుగా దేశ రాజధానిలో శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు ఇవాళ కఠినంగా వ్యవహరించారు. కొత్త పార్లమెంట్ భవనం దిశగా దూసుకువచ్చిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చిపడేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుమారు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేపట్టిన శాంతియుత నిరసన నేడు ఉద్రిక్తతకు దారి తీసింది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు.. పార్లమెంట్ కొత్త భవనం వైపునకు మార్చ్ చేపట్టారు. అయితే పార్లమెంట్ భవనం పరిధిలోని రెండు కిలోమీటర్ల మేర కఠిన ఆంక్షలు అమల్లో ఉండటంతో అటువైపుగా వెళ్లొద్దని పోలీసులు వారించినా రెజ్లర్లు తమ మార్చ్‌ను కొనసాగించే యత్నం చేశారు. దీంతో పోలీసులు రెజ్లర్లపై కఠినంగా వ్యవహరించారు. వినేశ్ ఫోగట్, సాక్షిమాలిక్, భజరంగ్ పునియా వంటి దేశం గర్వించే రెజ్లర్లను ఈడ్చిపడేశారు.
బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని నెలరోజులుగా తాము ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రెజ్లర్లు.. అతడు కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడితే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఇదివరకే హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఆదివారం ‘మహిళా సమ్మాన్ మహా పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మహిళా సమ్మాన్ మహా పంచాయత్ నేపథ్యంలో పోలీసులు పార్లమెంట్ భవనం వైపునకు వెళ్లే మార్గాలలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయడంతో పాటు జంతర్ మంతర్ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. అయితే రెజ్లర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మార్చ్ చేపట్టేందుకు ముందుకు కదిలారు. రెజ్లర్లతో కలిసివచ్చిన నిరసనకారులతో కలిసి వారు పార్లెమెంట్ కొత్త భవనం వైపుగా సాగారు. పోలీసులు ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించుకుని ముందుకుసాగేందుకు యత్నించారు.
ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు.. ఆందోళనకారులను నిర్బంధించి వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించారు. జంతర్ మంతర్ వద్ద కూడా నిరసన స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్టు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ మీడియాకు వెల్లడించారు.
కాగా రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. దేశానికి ఖ్యాతిని తెచ్చిన క్రీడాకారులపై ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, రెజ్లర్లకు మద్దతుగా నిలిచినవారు ఈ దాడిని ఖండించారు.