ప్రోకబడ్డి లీగ్ సీజన్ 7లో  పుణే పల్టాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. పాట్నాలోని పాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఉత్కంఠపోరులో గుజరాత్ పార్చూన్ జాయింట్ జట్టును ఓడించి విజయాన్ని అందుకుంది. పల్టాన్ ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించి జట్టు విజయంలో తలో చెయ్యి వేశారు. అయితే గుజరాత్ జట్టు కూడా ఓటమిని అంత తొందరగా ఏం అంగీకరించలేదు. చివరివరకు పోరాడి కేవలం 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

పుణే ఆటగాళ్ళలో గిరీశ్ 7, పవన్ 6, అమిత్ 5, మంజిత్ 4 పాయింట్లతో  రాణించారు. మిగతా ఆటగాళ్లు పంకజ్ 3, సుర్జీత్ 2, సంకేత్ 1 పాయింట్ సాధించి పుణే విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 13, ఆలౌట్ ల ద్వారా 2,  ఎక్స్‌ట్రాల రూపంలో 3తో మొత్తం 33పాయింట్లు సాధించింది. 

ఇక గుజరాత్ విషయానికి  వస్తే ఈ  మ్యాచ్ లోనే అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సచిన్ సాధించాడు. సచిన్ 9, రోహిత్  6, మోరే 5 పాయింట్లతో ఆకట్టుకున్నా విజయతీరాలకు చేర్చలేకపోయారు. రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్  ద్వారా 2 పాయింట్లతో మొత్తం 31 పాయింట్లు సాధించింది. అయినప్పటికి రెండు పాయింట్లు వెనుకబడటంతో 31-33 స్వల్ఫ తేడాతో పుణేరీ పల్టాన్ విజయాన్ని అందుకుంది.