ప్రో కబడ్డి 2019: హోంగ్రౌండ్ లో పూణేకు తప్పని ఓటమి.. పాట్నా సంచలన విజయం
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పుణేరీ పల్టాన్స్ ను వారి సొంత మైదానంలోనే 22 పాయింట్ల తేడాతో ఓడించి ఘన విజయాన్ని అందుకుంది.

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పుణేరీ పల్టాన్ ఘోర ఓటమిని చవిచూసింది. హోంగ్రౌండ్, సొంత ప్రేక్షకుల మధ్యలో పాట్నా పైరేట్స్ తో తలపడ్డ పూణే 22 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. సీజన్ ఆరంభం నుండి వరుస ఓటములతో సతమతమవుతున్న పైరేట్స్ రెండు, మూడు మ్యాచుల్లో వరుసగా విజయాన్ని అందుకుని పాయింట్స్ పట్టికలో పైపైకి ఎగబాకుతోంది.
పుణేలోని శ్రీ శివ చత్రపతి రెజ్లింగ్ హాల్ ఈ రసవత్తర మ్యాచ్ కు వేదికయ్యింది. విజేత పాట్నా పైరేట్స్ ఆటగాళ్లలో ప్రదీప్ నర్వాల్ 18, నీరజ్ 11 పాయింట్లతో రాణించారు. అలాగే హదీ 5, యోను 4, లీ జంగ్ 3, జయదీప్ 2 పాయింట్లతో జట్టు విజయంతో తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 26, ట్యాకిల్స్ లో 18, ఆలౌట్ల ద్వారా 8, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 55 పాయింట్లు సాధించిన పైరేట్స్ టీం భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
అయితే పుణేరీ జట్టు కేవలం 33 పాయింట్ల వద్దే ఆటను ముగించి అభిమానులను నిరాశ పర్చింది. ఆటగాళ్లలో మంజిత్ 8, పంకజ్ 7, నితిన్ 6, అమిత్ 5, సుర్జిత్ 3 పాయింట్లు సాధించినా అవి జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో పల్టాన్స్ జట్టు రైడింగ్ లో 26, ట్యాకిల్స్ లో 8 పాయింట్లు మాత్రమే అందుకుని ఘోర ఓటమిని చవిచూసింది.