ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో తెలుగు టైటాన్స్ కు మరో ఓటమి తప్పలేదు. సొంత మైదానంలో ఆడుతున్న బెంగళూరు బుల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న టైటాన్స్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో పరాజయంపాలయ్యింది. టైటాన్స్ తరపున సిద్దార్థ్ దేశాయ్ 23 పాయింట్లతో, బుల్స్ తరపున పవన్ కుమార్ 23 పాయింట్లతో అదరగొట్టారు. పోటీ బెంగళూరు  బుల్స్-తెలుగు టైటాన్స్ మధ్య కాకుండా సిద్దార్థ్-పవన్ కుమార్ ల మధ్య సాగింది.   

బెంగళూరులోని కంఠీరవ స్టేడియం ఈ ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. హోం గ్రౌండ్ లో సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్ ఆడుతున్న బుల్స్ జట్టు విజయంతో  వీడ్కోలు పలికింది. రైడింగ్ లో  29, ట్యాకిల్స్ లో  7, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 40 పాయింట్లు సాధించింది. బెంగళూరు ఆటగాళ్లలో పవన్ కుమార్ 23, రోహిత్ 5, మహేందర్ సింగ్  3 పాయింట్లతో జట్టును విజయంలో కీలకంగా వ్యవహరించారు.

ఇక టైటాన్స్ విషయానికి వస్తే రైడింగ్ లో 31, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2 ఇలా 39 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో సిద్దార్థ్ 23, అబోజర్ 4, రాకేశ్ 4, ఫహాద్ 2 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. చివరివరకు స్థానిక జట్టులో హోరాహోరీగా పోరాడి కేవలం 1 పాయింట్ తేడాతో టైటాన్స్ జట్టు ఓటమిపాలయ్యింది.