సారాంశం
WTC 2023 Prize Money: 2021-2023కి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కు తాజాగా ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది.
వచ్చేనెల 7 - 11 వరకు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపయిన్‌షిప్ (2021-2023) ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు ఇరుజట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముగిసిన తర్వాత విజేతతో పాటు రన్నరప్, ఆ తర్వాత స్థానాల్లో ఇచ్చే ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది.
ఈ రెండేండ్ల కాలానికి గాను 3.8 మిలియన్ డాలర్ల నగదును డబ్ల్యూటీసీ ఆడిన 9 జట్లకు పంచనుంది ఐసీసీ. దీని ప్రకారం.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ విజేతకు 1.6 మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ దక్కనుంది. అంటే ఓవల్ టెస్టు లో గెలిచే జట్టుకు రూ. 13.32 కోట్లు దక్కుతాయి. గతేడాది కూడా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో గెలిచిన కివీస్ కు రూ. 1.6 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ దక్కింది.
ఇక ఓవల్ లో రన్నరప్ గా నిలిచిన జట్టుకు గెలిచిన జట్టులో సగం రూ. 6.5 కోట్లు (800,000 డాలర్లు) అందుతాయి. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 450,000 డాలర్లు (రూ. 3.5 కోట్లు), ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్ కు 350, 000 డాలర్లు (రూ. 2.8 కోట్లు).. ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు (రూ. 1.6 కోట్లు) దక్కుతాయి.
ఈ క్రమంలో తర్వాత నిలిచిన న్యూజిలాండ్ , పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లకు తలా 100,000 డాలర్లు ( ఒక్కో జట్టుకు రూ. 82 లక్షలు) అందుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే ఐసీసీ ఈ ప్రైజ్ మనీని పంచనున్నది.