బెంగళూరు: వివిధ మైక్రో బ్లాగింగ్ వేదికల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పోస్టులను, ప్రొఫైల్ పిక్చర్స్ ను తీసేసింది.  దానిపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దానిపై తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన చెప్పాడు. కెప్టెన్ కు కూడా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారడు.

ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. "పోస్టులు మాయమయ్యాయి, కెప్టెన్ కు సమాచారం ఇవ్వలేదు" అని అన్నాడు. ఏమైనా సాయం కావాలంటే తనకు చెప్పాలని అన్నాడు.

 

దానికి ముందు లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కూడా ఆర్సీబీ ప్రొఫైల్ పిక్చర్స్ ను, పోస్టులను వివిధ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ల నుంచి తొలగించడదాన్ని ప్రశ్నించాడు. ఆర్సీబీకి ట్యాగ్ చేస్తూ "అరే.. ఇదేం గూగ్లీ?  మీ ప్రొఫైల్ పిక్చర్స్, ఇన్ స్టా గ్రామ్ పోస్టులు ఎక్కడికెళ్లాయి" అని చాహల్ అన్నాడు.

 

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు సహచరుడు ఏబీ డీ విలీయర్స్ కూడా ఆ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.  ఆర్సీబీని ట్యాగ్ చేస్తూ... మన సోషల్ మీడియా ఖాతాలు ఎక్కడికి వెళ్లాయి, ఇది స్ట్రాటజిక్ బ్రేక్ అని ఆశిస్తున్నా అంటూ ఆయన ట్వీట్ చేశాడు. 

 

బెంగళూరుకు చెందిన ఐపిఎల్ ఫ్రాంచైజీ అభిమానులు వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ప్రొఫైల్ పిక్చర్స్ ను తొలగించడంపై అంతకు ముందు బుధవారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదికారిక ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఫేస్ బుక్ ఖాతా నుంచి ప్రొఫైల్ పిక్చర్స్ తీసేశారు. జట్టు అధికారిక ఇన్ స్టా గ్రామ్ నుంచి జట్టు అధికార వర్గానికి చెందిన పోస్టులను తొలగించారు. 

ఆర్సీబీ వచ్చే ఐపిఎల్ 13వ ఎడిషన్ కు ఫ్రాంచైజీ పేరు మార్చుకుంటుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఆర్సీబీ ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాల్లో ఆర్సీబీ పేరును రాయల్ చాలెంజర్స్ గా మార్చారు. 

ఆర్సీబీ ఐపిఎల్ 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ ముత్తూట్ ఫిన్ కార్ప్ తమ టైటిల్ స్పాన్సరర్ గా మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.