వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలక అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక, మొదటి వికెట్‌కి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కరుణరత్నే 52 పరుగులు చేసి అవుట్ కాగా 55 పరుగులు చేసిన గుణతిలక, థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి అవుట్ అయ్యాడు. 

21వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్, రెండో బంతికే ఓపెనర్ కరుణరత్నేను అవుట్ చేశాడు. అద్భుత క్యాచ్‌తో కరుణరత్నేను అవుట్ చేసిన పోలార్డ్ ఓవర్‌లోనే గుణతిలక, అంపైర్ సంచలనాత్మక నిర్ణయానికి బలి అయ్యాడు.

పోలార్డ్ వేసిన బంతిని డిఫెన్స్ చేసిన గుణతిలక, నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న పథుమ్ నిశాక సింగిల్ కోసం ముందుకు రావడంతో అతన్ని వెనక్కి వెళ్లమని చెప్పడానికి ముందుకు వచ్చాడు. అయితే అదే సమయంలో పోలార్డ్ బంతిని అందుకుని, నిశాకను రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే గుణతిలక చూడకుండా కాలితో బంతిని తన్నడంతో థర్డ్ అంపైర్... ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కి అడ్డొచ్చాడని భావించి అతన్ని అవుట్‌గా ప్రకటించాడు. గుణతిలక అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన లంక, 49 ఓవర్లలో 232 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

విండీస్ ఓపెనర్ షై హోప్ 110, ఎడ్విన్ లూయిస్ 65 పరుగులు చేయడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది విండీస్. అయితే గుణతిలక అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది.