టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనాకు కూడా ప్రధాని మోడీ లేఖ రాశారు. ఆగస్ట్ 15న మీరు కఠినమైన నిర్ణయం తీసుకున్నారనని.. కానీ దానిని తాను రిటైర్మెంట్ అనే పదంతో పిలవలేనని ప్రధాని అన్నారు.

నీలో ఆడే సత్తా ఉందని.. ఎంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించే నువ్వు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతావని తాను ఊహించలేదన్నారు. ఏదీ ఏమైనా నీ సెకండ్ ఇన్నింగ్స్ సజావుగా సాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇంతకాలం భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలు అందించావని... ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడావని రైనా సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో మీరు సభ్యుడిగా ఉన్నారని ప్రధాని తెలిపారు.

ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మీ ప్రదర్శనను దగ్గరుండి చూశానని.. ఆ ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని నరేంద్రమోడీ గుర్తుచేశారు. భారత జట్టుకు నీ లాంటి మంచి ఫీల్డర్ అవసరం ఎంతో ఉందన్న ఆయన..నీ నిష్క్రమణతో టీమిండియా దానిని మిస్సవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నువ్వు ఏం చేసినా అది దేశానికి ఎంతో దోహదపడిందని ప్రధాని చెప్పుకొచ్చారు. మోడీ లేఖపై రైనా ట్విట్టర్‌లో స్పందించాడు. థ్యాంక్యూ మోడీజీ... మీరిచ్చిన సందేశం తమకు చాలా విలువైనదని రైనా అన్నాడు.

దేశం కోసం ఆడేటప్పుడు.. విజయం కోసం స్వేదాన్ని చిందిస్తామని, దేశ ప్రధానితో పాటు.. ప్రజలు మా ప్రదర్శనను గురించి మెచ్చుకోవడం కంటే గొప్ప విషయం ఏది లేదని రైనా ఉద్వేగానికి గురయ్యాడు. మీరిచ్చిన సందేశాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తున్నానని.. జైహింద్ అంటూ రైనా పేర్కొన్నాడు.