అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఆయన సహచరులు, అభిమానులు సహా ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రధాని నరేంద్రమోడీ చేరారు.

‘‘ ధోనీ రిటైర్మెంట్ గురించి దేశం మొత్తం చర్చించుకుందని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మహీకి ప్రధాని లేఖ రాశారు. 130 కోట్ల మంది భారతీయులు ఆయన నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి వుంటాయని మోడీ ప్రశంసించారు.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా తీవ్ర ఒత్తిడిని తట్టుకుని నిలబడిన ధోనీ ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలిచాడని ప్రధాని కొనియాడారు. 2007 టీ 20 ప్రపంచకప్ ఫైనల్స్ అందుకు నిజమైన ఉదాహరణ అని మోడీ గుర్తుచేశారు.

క్రికెట్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ధోనీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని అన్నారు. కుటుంబసభ్యులతో ఆయన మరింత సమయం గడుపుతారని ఆశిస్తున్నట్లు నరేంద్రమోడీ తన లేఖలో ఆకాంక్షించారు.

ధోనీ భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండాలని ప్రధాని లేఖలో అన్నారు. మోడీ లేఖపై ధోనీ సైతం స్పందించారు. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని పేర్కొంటూ.. మోడీకి ధన్యవాదాలు తెలిపాడు.