మ్యాచ్ ఆరంభానికి ముందు గ్రౌండ్‌లో 30 యార్డ్స్ సర్కిల్ గీయలేదనే విషయాన్ని గుర్తించిన సిబ్బంది... 10 నిమిషాలు ఆలస్యంగా టాస్..
ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్, 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం లేకపోయినా, వాతావరణం మ్యాచ్‌కి పూర్తిగా సహకరించేలా ఉన్నా.. టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. మూడో టీ20 ఆలస్యం కావడానికి ఓ వింతైన కారణం ఉంది.
మ్యాచ్ ఆరంభానికి ముందు గ్రౌండ్‌లో 30 యార్డ్స్ సర్కిల్ గీయలేదనే విషయాన్ని గుర్తించారు సిబ్బంది. మ్యాచ్ సమయానికి నిమిషాల ముందు ఈ విషయం గుర్తుకు రావడంతో హడావుడిగా ఆ పని మొదలెట్టారు. దీంతో టాస్ కొన్ని నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది..
సాధారణంగా టాస్ ముగిసిన తర్వాత ఆట ప్రారంభించడానికి 30 నిమిషాల సమయం ఉంటుంది. గ్రౌండ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 20 నిమిషాల గ్యాప్‌లోనే గ్రౌండ్‌లోకి వచ్చేశారు ఇరు జట్లు. క్రికెట్‌లో ప్రతీ విషయంపై తన స్టైల్‌లో స్పందించే భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, దీనిపై కూడా తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు.
‘యూనిక్ డిలే.. ఇలాంటివి లేకుండా టూర్‌ని ముగించడం వీలయ్యే విషయం కాదు. క్రికెటర్‌గా ప్రతీ చిన్న విషయానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడూ ఊహించనిదేదో జరగబోతుందని అనుకోవడమే బెటర్.. యశస్వి జైస్వాల్‌కి ఆల్ ది బెస్ట్.. చిన్ని పయ్యా అదరగొట్టు..’ అంటూ ట్వీట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..
మొదటి రెండు టీ20ల్లో ఓడిన టీమిండియా, సిరీస్ నిలవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ రోవ్‌మెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో బ్యాటర్‌గా, బౌలర్‌గా ఫెయిల్ అయినా అక్షర్ పటేల్‌కి మూడో టీ20లోనూ చోటు దక్కింది. సంజూ శాంసన్ నేటి మ్యాచ్‌కి వికెట్ కీపర్‌గా వ్యవహరించబోతున్నాడు.
గాయంతో రెండో టీ20లో ఆడని కుల్దీప్ యాదవ్, తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి భిష్ణోయ్ మళ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, నేటి మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియాకి కెప్టెన్సీ చేయబోతున్న హార్ధిక్ పాండ్యాకి ఈ మ్యాచ్, ఈ సిరీస్ విజయం చాలా కీలకంగా మారనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో ఓడిన వెస్టిండీస్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.
