సారాంశం
IPL vs PSL: గత కొంతకాలంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై పడి ఏడుస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు పోటీగా ఆ దేశంలోని పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేతతో జాతీయ జట్టుకు మ్యాచ్ ఆడించనుంది.
ఇండియాలో రెండు నెలలుగా జరుగుతున్న ఐపీఎల్ -16 ఫైనల్స్ కు చేరుకుంది. ఈనెల 28 (ఆదివారం) గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే ఫుల్ సక్సెస్ అయిన ఐపీఎల్ - 16.. వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నది. కాగా ఐపీఎల్ సక్సెస్ చూసి కన్నుగొట్టిందో లేక వ్యూయర్‌షిప్ ను తగ్గించాలని ప్లాన్ వేసిందో గానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది.
సరిగ్గా ఐపీఎల్ - 2023 ఫైనల్ జరిగే రోజునే పాక్ లో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) - 2023 విజేత లాహోర్ ఖలాండర్స్ తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటుచేసింది.
మే 28న బాబర్ సేన.. హరీస్ రౌఫ్ సారథ్యంలోని లాహోర్ ఖలాండర్స్ ను ఢీకొననుంది. వాస్తవానికి లాహోర్ ఖలాండర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది. అతడి సారథ్యంలోనే లాహోర్.. వరుసగా రెండు సీజన్లు ట్రోఫీ నెగ్గింది. కానీ అతడిని కాదని ఫ్రెండ్లీ మ్యాచ్ లో హరీస్ రౌఫ్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది లాహోర్. ఈ మేరకు లాహోర్ ఖలాండర్స్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో పాకిస్తాన్ నేషనల్ టీమ్ తో ఆడబోయే జట్టును ప్రకటించింది.
15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్ తో పాటు స్థానిక ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. అయితే పాకిస్తాన్ జాతీయ జట్టు మాత్రం లాహోర్ తో ఆడబోయే జట్టును ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ బాబర్ ఆజమ్ సారథ్యంలో అఫ్రిది కూడా ఉంటాడా..? లేక తప్పుకుంటాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నరోవల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగనుంది.
ఏదేమైనా ఈ మ్యాచ్ ను ఐపీఎల్ - 16 ఫైనల్ కు కౌంటర్ గానే పీసీబీ నిర్వహిస్తుందన్నది బహిరంగ రహస్యమే. కానీ పీఎస్ఎల్ తో పోలిస్తే ఐపీఎల్ విలువ కొన్ని వందల రెట్లు ఎక్కువ. ప్రపంచ క్రీడా రంగంలో విలువ పరంగా గానీ, క్రేజ్ పరంగా గానీ టాప్ -3 లో ఉన్న ఐపీఎల్ తో పోటీ పడటమంటే.. అది హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది..