లాహోర్: ఆసియా కప్ ఈ ఏడాది తటస్థ వేదిక దుబాయ్ లో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగాలీ చేసిన ప్రకటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ఖండించారు. ఆసియా కప్ నిర్వహణపై తాము ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోలేదని, అన్ని ఆసియా జట్లను సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 

ఒక వేళ తాము ఈ టోర్నీని నిర్వహించపోయినా కూడా దుబాయ్ ఒక్కటే వేదిక కాబోదని ఆయన అన్నారు. ఆసియా జట్టుకు ప్రయోజనం కలగడానికే ఈ టోర్నీని నిర్వహిస్తారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని జట్లను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తమకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

Also Read: మారిన ఆసియా కప్ వేదిక: పాక్ తో భారత్ ఆడుతుందని గంగూలీ

ఈసారి పాకిస్తాన్ ఆసియా కప్ ను నిర్వహించాల్సి ఉంది. పాకిస్తాన్ లో ఆసియా కప్ జరిగితే తాము ఆడబోమని భారత్ ప్రకటించింది. దాంతో పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహించడం సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గంగూలీ ఓ ప్రకటన చేశాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్, భారత్ తలపడుతాయని అంటూ దుబాయ్ వేదికగా ఆసియా కప్ జరుగుతుందని చెప్పారు. 

2018లో భారత్ ఆసియా కప్ నిర్వహించినప్పుడు పాకిస్తాన్ భారత్ కు ఆటగాళ్లను పంపించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ టోర్నీని దుబాయ్, అబుదాబి వేదికలపై నిర్వహించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భార్త ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ను ఒడించింది. 

ఇదిలావుంటే, మార్చి 3వ తేదీన దుబాయ్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ్య దేశాలు పాల్గొని 2020 ఆసియా కప్ టోర్నీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.