కోల్ కతా: వచ్చే ఆసియా కప్ వేదిక మారింది. పాకిస్తాన్ లో ఆడడానికి భారత్ ససేమిరా అనడంతో వేదిక దుబాయ్ కు మారింది. అయితే, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడదంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తోసిపుచ్చారు. 

ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ వేదికగా సెప్టెంబర్ లో ఆసియా కప్ పోటీలు జరగాల్సి ఉండింది. అయితే, పాకిస్తాన్ లో ఆడేందుకు ఇండియా నిరాకరించింది. భద్రతా కారణాలు చెబుతూ ఇండియా ఆ విషయం చెప్పింది. దీంతో వేదిక దుబాయ్ కి మారింది.

ఆసియా కప్ దుబాయ్ లో జరుగుతుందని గంగూలీ చెప్పారు. రెండు దేశాలు కూడా ఆడుతాయని అన్నారు. టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే టోర్నీ తటస్థ వేదికపై జరగాలని బీసీసీఐ తేల్చి చెప్పింది. 

2012 -13 సిరీస్ తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షి సిరీస్ లు జరగలేదు. భారత్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ అది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 2013 ప్రారంభం నుంచి పాకిస్తాన్, ఇండియా ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 

మూడు వరుస విజయాలతో జట్టు టీ20 మహిళా ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ కు చేరుకున్న హర్మాన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టును గంగూలీ అభినందించారు. వారు అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నారని, ఈ ప్రపంచ కప్ పోటీల్లో ఎవరు కూడా ఫేవరైట్లు కారని ఆయన అన్నారు. మంచి జట్టు, వారు ఎంత వరకు ముందుకు సాగుతారో చూద్దామని అన్నారు.

రెండో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ సేన తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచులో కర్ణాటకపై పశ్చిమ బెంగాల్  తలపడడంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.