Asia Cup 2023: ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం  సద్దుమణిగిందని  ఇక టోర్నీ  మొదలవడమే లేటు అనుకున్న అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది.

సాధారణంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారితే పాత ప్రభుత్వంలోని పథకాలకు వారికి అనుకూలంగా ఉండేందుకు పేరు మార్చడమో లేదంటే తమదైన ముద్ర కనిపించేలా ఏదైనా మార్పులు చేయడమో చేస్తుంటాయి. కానీ అందరూ ఆమోదించిన పథకాన్ని తీసేస్తే అది మొదటికే మోసం. ప్రస్తుతం ఆసియా కప్ పరిస్థితి ఇలాగే ఉంది. నిన్నా మొన్నటిదాకా చర్చోపచర్చలు జరిపి ఆఖరికి పీసీబీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌నే ఆమోదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కాబోయే కొత్త పీసీబీ చీఫ్ ఊహించని షాకిచ్చాడు. హైబ్రిడ్ మోడల్ తనకు నచ్చలేదని తేల్చేశాడు. 

పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథీ పదవీకాలం జూన్ 21తో ముగియడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషనర్ అహ్మద్ షెహజాద్ ఫరూక్ రానా బాధ్యతలు తీసుకున్నారు. మరికొద్దిరోజుల్లోనే పీసీబీకి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బలపరిచిన జకా అష్రఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు.

బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ... ‘నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని నిర్ణయించింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి..’ అని స్పష్టం చేశాడు. 

Scroll to load tweet…

అయితే లంకలో.. లేకపోతే పాక్ ఔట్.. 

అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే.. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించిన ఆప్షన్లు కూడా దానికి లేవు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం.

విలేకరుల సమావేశంలోనే అష్రఫ్ ఆసియా కప్ లో హైబ్రిడ్ మోడల్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని గురించి మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో మెయిన్ మ్యాచ్‌లు అన్నీ పాకిస్తాన్ బయిటే జరుగుతున్నాయి. భూటాన్, నేపాల్ వంటి టీమ్స్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. నేను ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా..’అని చెప్పాడు. 

ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది. ఇక ఇప్పుడు కొత్త అధ్యక్షుడు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.