MI vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) తో పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

PBKS vs MI Toss Could Decide IPL 2025 Qualifier: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబయి ఇండియన్స్ (MI) జట్ల మధ్య పోటీ ఉత్కంఠను పెంచుతోంది.  గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరుకోవాలని ఇరు జట్లు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ప్రభావం అత్యంత కీలకంగా మారనుందని గణాంకాలు సూచిస్తున్నాయి. టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ ను గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ముంబై vs పంజాబ్ క్వాలిఫయర్ 2: టాస్ ఫ్యాక్టర్ ఎలా కీలకం అవుతుంది?

ఈ సీజన్‌లో అహ్మదాబాద్ వేదికపై జరిగిన 7 మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు టీమ్స్ 200 పరుగుల మార్క్‌ను దాటాయి. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, టాస్ గెలిచిన జట్టు విజయం సాధించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే, టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు గెలిచాయి. కేవలం ఒక్కసారి మాత్రమే లక్ష్యాన్ని చేధించిన జట్టు గెలిచింది.

లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటన్స్‌పై 181 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలి ఉండగానే చేధించి, ఈ సీజన్‌లో ఛేజింగ్ విజయాన్ని నమోదు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది.

అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ కు మంచి రికార్డు

ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. మార్చిలో గుజరాత్ టైటన్స్‌పై 243/5 స్కోరు చేసింది. ఈ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్ల స్కోర్లు వరుసగా 243, 196, 217, 203, 224, 235. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జట్లు సాధించిన స్కోర్లు: 232, 160, 159, 204, 186, 202, 147 పరుగులుగా ఉన్నాయి. పంజాబ్ vs  ముంబై మ్యాచ్ లో కూడా బిగ్ స్కోర్లు నమోదు కావచ్చు. 

పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

IPL చరిత్రలో ఈ రెండు జట్లు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబయి ఇండియన్స్ 17 విజయాలు సాధించింది. పంజాబ్ కింగ్స్‌కు 15 విజయాలు అందుకుంది.

ముంబయి, పంజాబ్ రెండూ ఫైనల్ ఆశలతో బరిలోకి దిగుతున్నాయి

పంజాబ్ కింగ్స్, ముల్లాన్‌పూర్‌లో జరిగిన క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలై రెండవ అవకాశం పొందింది. ముంబయి ఇండియన్స్ ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకునే దిశగా ముందడుగు వేసింది.

ఈ నేపథ్యంలో, టాస్ ఎవరికి అనుకూలిస్తే వారే మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ఎందుకంటే అహ్మదాబాద్ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే స్పష్టమైన విజయ శాతం ఉంది. కాబట్టి మొత్తంగా, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో టాస్‌ గేమ్‌ను పూర్తిగా మలుపుతిప్పే అవకాశం ఉంది.