India vs Australia: కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిడ్నీకి బయలుదేరిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్... మార్చి 1న ప్రారంభమయ్యే మూడో టెస్టు నాటికి తిరిగి జట్టుతో కలవనున్న కమ్మిన్స్.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0 తేడాతో సిరీస్ నిలుపుకుంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఓడినా ఇప్పుడు సిరీస్‌ కోల్పోయే ప్రమాదమైతే ఉండదు..

ఢిల్లీ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, హుటాహుటిన స్వదేశానికి పయనమయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్యాట్ కమ్మిన్స్ కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది...

కొన్నిరోజులు సిడ్నీలో తన కుటుంబంతో ఉండే ప్యాట్ కమ్మిన్స్, ఇండోర్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు సమయానికి తిరిగి జట్టుతో కలుస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలియచేసింది. ఒకవేళ ప్యాట్ కమ్మిన్స్ రాక ఆలస్యమైతే టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు...

మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ఇంకా 8 రోజుల సమయం ఉండడంతో ప్యాట్ కమ్మిన్స్ తిరిగి, టీమ్‌తో కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు, కొన్ని కారణాల వల్ల ఇండోర్‌కి మార్చబడింది. ధర్మశాలలో శీతాకాలం కురిసిన మంచు కారణంగా అవుట్ ఫీల్డ్, పిచ్ పాడుకావడంతో వేదికను ఇండోర్‌కి మారుస్తున్నట్టు తెలియచేసింది బీసీసీఐ...

అయితే ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలిస్తుందనే ఉద్దేశంతోనే స్పిన్ పిచ్ ఉండే ఇండోర్‌కి వేదికను మార్చినట్టు ఆస్ట్రేలియా మీడియా ఆరోపించింది. ఇక్కడ భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి అదిరిపోయే రికార్డు ఉండడం ఆస్ట్రేలియాని కలవరబెడుతున్న విషయం. 

గాయాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్.. మూడో టెస్టు సమయానికి పూర్తిగా కోలుకుంటున్నారని సమాచారం. వీరితో పాటు ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా మూడో టెస్టులో బరిలో దిగబోతున్నాడు...

కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ రీఎంట్రీ ఇస్తే ఆస్ట్రేలియా టీమ్ నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన డేవిడ్ వార్నర్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.. వార్నర్ కోలుకోకపోతే ట్రావిస్ హెడ్‌ని ఓపెనర్‌గా కొనసాగిస్తూ కామెరూన్ గ్రీన్‌ని మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపించే అవకాశాలు ఉన్నాయి.

అలాగే తొలి టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన స్పిన్నర్ టాడ్ ముర్ఫీ కోసం గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ మిచెల్ స్వీప్సన్, మూడో టెస్టు ఆడే అవకాశాలు ఉన్నాయి...

భారత్‌పై మంచి రికార్డు ఉన్న స్వీప్సన్, పెటర్నిటీ లీవ్ ద్వారా తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. స్వీప్సన్ భార్య, రెండో టెస్టు సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. మిచెల్ స్వీప్సన్ కూడా జట్టుతో చేరితే ఆస్ట్రేలియా పూర్తి పటిష్టంగా మారుతుంది.