Asianet News TeluguAsianet News Telugu

ముల్తాన్ కా సుల్తాన్ అబ్రర్ అహ్మద్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్..

PAKvsENG 2022: తొలి టెస్టులో పాకిస్తాన్ బౌలర్లను క్లబ్ బౌలర్ల మాదిరిగా బాదిన ఇంగ్లాండ్ కు అసలైన స్పిన్ రుచిని చూపించాడు అబ్రర్ అహ్మద్. తన కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ కుర్రాడు..  అరంగేట్ర మ్యాచ్ లోనే ఏకంగా ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు.

PAKvsENG 2nd Test: Abrar Ahmed Takes 7 Wickets, England All Out in First Innings
Author
First Published Dec 9, 2022, 3:46 PM IST

రావల్పిండి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 506 పరుగులు చేసిన జట్టు.. బజ్ బాల్ ఆటతో  అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న  ఇంగ్లాండ్ ముల్తాన్ వేదికగా జరుగుతున్న  రెండో టెస్టులో మాత్రం బోల్తా కొట్టింది.  స్పిన్ కు సహకరించే ముల్తాన్ పిచ్ పై కొత్త కుర్రాడు అబ్రర్ అహ్మద్ దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆటకు అడ్డుకట్టు వేస్తూ ఆ జట్టును గజగజ వణికించాడు.  తన స్పిన్ తో ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. తొలి టెస్టులో పాకిస్తాన్ బౌలర్లను క్లబ్ బౌలర్ల మాదిరిగా బాదిన ఇంగ్లాండ్ కు అసలైన స్పిన్ రుచిని చూపించాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే ఏకంగా ఏడు వికెట్లు (7-114) తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు.   అబ్రర్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్.. 51.4 ఓవర్లలో 281 పరుగులకే ఆలౌట్ అయింది. జహీద్ మహ్మద్ కు మూడు వికెట్లు దక్కాయి. 

ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు గత మ్యాచ్ లో మాదిరిగా శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ లో  పాక్ బౌలర్లు బాబర్ ఆజమ్ అనుకున్న ఫలితాలను రాబట్టడంలో విఫలమైనా  ఈ మ్యాచ్ లో మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని  అబ్రర్ వమ్ము చేయలేదు. తొలుత  జాక్ క్రాలే (19) ను ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 8.5 ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేసిన అబ్రర్.. తర్వాత 18 ఓవర్ చివరిబంతికి  బెన్ డకెట్ (63) ను పెవిలియన్ కు పంపాడు. 

ఆ  తర్వాత కొద్దిసేపటికే జో రూట్ (8) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపగా.. ధాటిగా ఆడుతున్న ఓలీ పోప్ (60) ను కూడా  బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన  హ్యారీ బ్రూక్ (9) కూడా  ఎక్కువసేపు నిలువలేదు.  ఈ ఐదుగురిలో  జో రూట్ తప్ప మిగిలినవారంతా  రావల్పిండి టెస్టులో తొలి రోజే సెంచరీలు చేసిన వీరులే కావడం గమనార్హం.  

 

లంచ్ తర్వాత అర్బర్ ఇంగ్లాండ్ మరో భారీ షాక్ ఇచ్చాడు.  ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ (38 బంతుల్లో 30, 3 ఫోర్లు, 1 సిక్స్) ను  క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇదే ఊపులో విల్ జాక్స్ (44 బంతుల్లో 31, 1 ఫోర్, 2 సిక్సర్లు) ను సైతం ఎల్బీడబ్ల్యూ చేశాడు.  దీంతో అతడికి 7 వికెట్లు దక్కాయి.   వరుసగా వికెట్లు తీస్తుండటంతో తొలి టెస్టులోనే పది వికెట్లు తీస్తాడా..? అని పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు.  

అయితే ఒలీ రాబిన్సన్ (5) ను జహీద్ మహ్మద్   ఔట్ చేయడంతో పాక్ ఫ్యాన్స్  ఆశలు నెరవేరలేదు.  మార్క్ వుడ్.. 27 బంతుల్లో 8 ఫోర్లతో  36 పరుగులు చేసి దూకుడుగా ఆడినా అతడికి సహకరించే వాళ్లు కరువవడంతో ఇంగ్లాండ్  300 మార్క్ కూడా చేరలేదు.   జాన్ లీచ్ (0) ను జహీద్  వెనక్కి పంపగా.. అండర్సన్  ను కూడా బోల్డ్ చేసి  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. ఫలితంగా ఆ జట్టు 51.4 ఓవర్లలో  281 పరుగులకే ఆలౌట్ అయింది. 

పాకిస్తాన్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ కే  ఏడు వికెట్లు దక్కాయి.    మరో స్పిన్నర్ జహీద్ మహ్మద్ మూడు వికెట్లు తీశాడు. ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ అలీ, మహ్మద్ నవాజ్ లు ప్రభావం చూపలేదు. పాకిస్తాన్ తరఫున అరంగేట్ర మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన చేసినవారిలో అబ్రర్ మూడో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ జహీర్ (1996లో కివీస్ పై 7-66), మహ్మద్ నజీర్ (1969లో న్యూజిలాండ్ పై 7-99) అబ్రర్ కంటే ముందున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios