టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను ఔట్ చేయడం తన కల అన్నాడు పాకిస్తాన్ యువ ఫాస్ట్  బౌలర్ నసీమ్ షా. ఓ క్రికెట్ కార్యక్రమంలో మాట్లాడిన అతను రోహిత్‌తో పాటు ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌‌లను కూడా ఔట్ చేయాలని ఉందని చెప్పాడు.

తొలుత రోహిత్ శర్మ గురించి చెబుతూ.. హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మకు అన్ని రకాల బంతులు ఆడే సామర్ధ్యం ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ రికార్డులే అతనేంటో చెబుతాయని తెలిపాడు.

రోహిత్ వికెట్ తీస్తే తన కల నిజమైనట్లేనన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ గురించి చెబుతూ.. అతనికి బ్యాటింగ్ టెక్నిక్ ఉంది. అతనిని ఔట్ చేయడం ద్వారా తనకు సంతోసం కలుగుతుందని నసీమ్ షా స్పష్టం చేశాడు.

గతంలో స్మిత్‌కు బౌలింగ్ చేసే అవకాశం లభించిందని.. కానీ ఔట్ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా రోహిత్, స్మిత్‌ను ఔట్ చేయాలంటే నసీమ్ మరింత కాలం వెయిట్ చేయక తప్పదు.

ఎందుకంటే పాకిస్తాన్ సమీప భవిష్యత్‌లో టీమిండియాతో కానీ, ఆస్ట్రేలియాతో కానీ ఆడే అవకాశం లేదు. అయితే వచ్చే నెలలో మాత్రం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేసే అవకాశం నసీమ్‌కు ఉంది.

ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్, పాక్ జట్లు మూడు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. మరోవైపు నసీమ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే తన సహచర ఆటగాళ్లతో కలిసి శిక్షణ పొందుతున్నాడు.