Asianet News TeluguAsianet News Telugu

పాక్‌లో అడుగుపెట్టగానే ఇంగ్లాండ్ టీమ్‌కి సుస్తీ... వైరస్ బారిన బెన్ స్టోక్స్ అండ్ టీమ్!

రావల్పిండి టెస్టుకి ముందు 12 మంది ఇంగ్లాండ్ ప్లేయర్లకు అస్వస్థత... క్వెట్టాలో ఉగ్రదాడి! టెస్టు సిరీస్ సజావుగా సాగడంపై రేగుతున్న అనుమానాలు...

Pakistan vs England: several cricketers along with captain ben stokes affected with virus
Author
First Published Nov 30, 2022, 1:25 PM IST

17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. రావల్పిండి టెస్టు ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌లోని ప్లేయర్లు, అంతుచిక్కని వైరస్ బారిన పడ్డారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు 11 మంది టీమ్ ప్లేయర్లు అనారోగ్యానికి గురయ్యారు. టీమ్ ప్లేయర్లతో పాటు మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా అనారోగ్యానికి గురి కావడం, పాక్‌లో ఉగ్రదాడులు జరుగుతుండడంతో ఇంగ్లాండ్ టీమ్ భయాందోళనలకు గురవుతోంది...

అయితే ఇంగ్లాండ్ టీమ్‌కి చేసిన పరీక్షల్లో కరోనా లక్షణాలు లేకపోవడంతో కోవిడ్ వైరస్ కాదని తేలిపోయింది. జలుబు, దగ్గుతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో టీమ్ ప్లేయర్లు అందరూ బాధపడుతుండడంతో బుధవారం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్స్‌ని రద్దు చేసింది ఇంగ్లాండ్ బోర్డు... కేవలం ఐదుగురు ప్లేయర్లు మాత్రమే రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ట్రైయినింగ్ సెషన్స్‌లో పాల్గొన్నారు... 

2005-06 సీజన్ తర్వాత మొట్టమొదటిసారి ఇంగ్లాంగ్ జట్టు, పాక్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం రావల్పిండి వేదికగా గురువారం ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే తొలి టెస్టు ఆడబోయే జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్...  రావల్పిండి టెస్టు ద్వారా టీ20 ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ టెస్టు ఆరంగ్రేటం చేయబోతున్నాడు.

తొలి టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రావ్లే, బెన్ డక్కెట్, ఓల్లీ పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ లీచ్, ఓల్లీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్

అయితే రావల్పిండి టెస్టు ఆరంభానికి ముందు పాక్‌లో తీవ్రవాద దాడులు జరగడం కూడా ఇంగ్లాండ్ జట్టును భయభ్రాంతులకు గురి చేస్తోంది. క్వెట్టాలో పాక్ పోలీసులపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఇంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఈవిధంగానే జరిగింది...

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు, మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు భద్రతా కారణాలతో సిరీస్‌ని రద్దు చేసుకుని, తిరిగి స్వదేశానికి వచ్చేసింది. ఈ సంఘటన తర్వాత ఇంగ్లాండ్ కూడా పాక్‌లో పర్యటించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఏడాది తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో పాక్‌లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్. ఈసారి అయినా టూర్ సజావుగా జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. 

కొన్నిరోజుల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ సంఘటనతో పాక్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన మార్క్ వుడ్, పాక్ పర్యటన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios