ICC T20I XI of 2021:టీమిండియా జట్టు నిండా  ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్ 2021 లో ఒక్కరంటే ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు. 

జట్టు నిండా స్టార్లే.. బ్యాటింగ్ కు దిగారంటే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్లను గడగడలాడించే బ్యాటింగ్ లైనప్.. అగ్రశ్రేణి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగల బౌలింగ్ దళం.. ఏ క్షణంలోనైనా మ్యాచులను మలుపు తిప్పగల స్పిన్నర్లు.. ఇలా జట్టు నిండా ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టీ20 టీమ్ ఆఫ్ 2021 లో ఒక్కరంటే ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు. మరోవైపు గతేడాది టీ20లలో అబ్బురపరిచే ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్.. ఐసీసీ ప్రకటించిన జట్టుకు కూడా కెప్టెన్ గా ఉన్నాడు. 

బుధవారం ట్విట్టర్ వేదికగా ఐసీసీ.. 2021 ఏడాదికి గాను టీమ్ ఆఫ్ ది ఈయర్ ను ప్రకటించింది. పాకిస్థాన్ సారథి బాబార్ ఆజమ్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన ఐసీసీ.. అదే దేశానికి చెందిన మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేసింది.

Scroll to load tweet…

ఐసీసీ ప్రకటించిన జట్టులో.. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్ ఓపెనర్లు గా ఉన్నారు. గతేడాది బట్లర్.. 14 టీ20లలో 589 పరుగులు చేేయగా రిజ్వాన్ ఏకంగా 1,326 పరుగులు సాధించాడు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తో పాటు ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ విజయాలలో అతడిదే కీలక పాత్ర. ఇక మూడో స్థానంలో బాబర్ ఆజమ్ ను ఎంపిక చేసిన ఐసీసీ.. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ ను తీసుకుంది. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కు స్థానం దక్కింది. ఆరో స్థానంలో మరో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కు అవకాశం ఇచ్చింది. 

వనిందు హసరంగకు అవకాశం : 

శ్రీలంక యువ సంచలనం వనిందు హసరంగ కు కూడా ఐసీసీ తన టీమ్ లో చోటు కల్పించింది. గతేడాది 20 టీ20లలో హసరంగ.. ఏకంగ 36 వికెట్లు పడగొట్టి పొట్టి ఫార్మాట్ లో నెంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు. హసరంగతో పాటు సౌతాఫ్రికా స్పిన్నర్ షంసీ కూడా స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్వుడ్, బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇక చివరగా పాకిస్థాన్ పేస్ సంచలనం షాహిన్ అఫ్రిదిని పదకొండో స్థానంలో ఎంపిక చేసింది ఐసీసీ.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఈయర్ 2021 జట్టు : జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజమ్, మార్క్రమ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, షంషీ, జోష్ హెజిల్వుడ్, వనిందు హసరంగ, ముస్తాఫిజుర్ రహ్మాన్, షాహీన్ అఫ్రిది