England Tour Of Pakistan: 2005 తర్వాత తమ దేశంలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ తో  టెస్టు సిరీస్ ఆడేందుకు గాను పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకుండానే బరిలోకి దిగుతున్నది. కానీ మిస్టర్ స్పిన్నర్ ను ఇంగ్లాండ్ తో జట్టుకు ఎంపిక చేసింది.

దశాబ్దంన్నర తర్వాత తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ కు అసలైన బౌలింగ్ మజాను చూపించడానికి పాకిస్తాన్ క్రికెట్ సిద్ధమైంది. మరికొద్దిరోజుల్లో ఇంగ్లాండ్ తో జరుగబోయే టెస్టు సిరీస్ కు ఆ జట్టు ఎంపిక చేసిన జట్టును చూస్తే ఇదే అనుమానం రాక మానదు. తమ ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకుండానే ప్రపంచ ఛాంపియన్లతో బరిలోకి దిగుతున్న పాకిస్తాన్.. మిస్టరీ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ తో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ అలీలకు జట్టులో చోటు కల్పించింది. అలాగే ఆ జట్టు స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కు కూడా టెస్టు జట్టులో చోటిచ్చింది. 

డిసెంబర్ 1 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్.. 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహిస్తుండగా పలువురు కీలక ఆటగాళ్లను పక్కనబెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 

జట్టు ఎంపికలో అబ్రర్ అహ్మద్ ఎంపిక గురించే అంతటా చర్చ జరుగుతున్నది. పాకిస్తాన్ దేశవాళీలో అబ్రర్ ను మిస్టరీ స్పిన్నర్ గా అభివర్ణిస్తున్నారు. సక్లయిన్ ముస్తక్ వంటి దిగ్గజ స్పిన్నర్ తర్వాత అంతటి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేక తంటాలు పడుతున్న పాకిస్తాన్ కు అబ్రర్ రూపంలో మెరుగైన స్పిన్నర్ దొరికాడని స్థానిక వార్తాపత్రికలు అతడిని కీర్తిస్తున్నాయి. 24 ఏండ్ల అబ్రర్.. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ లో 43 వికెట్లు పడగొట్టాడు.

గత కొంతకాలంగా పాకిస్తాన్ స్పిన్ అంటే యాసిర్ షా నే గుర్తుకువస్తాడు. కానీ ఇంగ్లాండ్ తో సిరీస్ కు అతడిని పక్కనబెట్టిన యాజమాన్యం.. అబ్రర్ ను జాతీయ జట్టులోకి తీసుకొచ్చింది. మరి ఈ మిస్టరీ స్పిన్నర్ ఎటువంటి అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి. 

ఇక 2005 నుంచి ఇంగ్లాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడని పాకిస్తాన్.. ఈ సిరీస్ కు సీనియర్ పేసర్ మహ్మద్ అలీని కూడా రప్పించింది. అతడు కూడా దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు అన్ క్యాప్డ్ బౌలర్లు మహ్మద్ వసీం, లెగ్ స్పిన్నర్ జహీద్ మహ్మద్ లకు కూడా జట్టులో చోటు దక్కింది. కానీ గత ఆస్ట్రేలియా, శ్రీలంక టెస్టులలో అంతగా రాణించని ఫవాద్ అలం, హసన్ అలీ, యాసిర్ షాలను బోర్డు పక్కనబెట్టింది. 

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు పాకిస్తాన్ జట్టు : బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్, అబ్రర్ అహ్మద్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ అలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, నౌమన్ అలీ, సల్మాన్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాన్ మసూద్, జహీద్ మహ్మూద్ 

Scroll to load tweet…

టెస్టు సిరీస్ షెడ్యూల్ : 

- డిసెంబర్ 1-5 తొలి టెస్టు : రావల్పిండి
- డిసెంబర్ 9-13 రెండో టెస్టు : ముల్తాన్ 
- డిసెంబర్ 17-21 మూడో టెస్టు : కరాచీ