భద్రతా కారణాల రిత్యా శ్రీలంక క్రికెటర్లు  కొందరు పాకిస్థాన్ లో పర్యటించడాకి విముఖత  చూపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ  నెల 27 నుండి  అక్టోబర్ 9 వరకు జరగాల్సిన  వన్డే, టీ20 సీరిస్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇలా ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య సాగుతున్న వివాదంలోకి పాక్ భారత్ ను లాగే ప్రయత్నం చేస్తోంది. లంక ఆటగాళ్ళ బహిష్కరణకు, ఐపిఎల్ కు లింక్ పెడుతూ పాక్ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''పాకిస్థాన్ పర్యటనను శ్రీలంక  క్రికెటర్లు బహిష్కరించడం వెనుక భారత్ హస్తముందని ఓ స్పోర్ట్స్ కామెంటేటర్ తెలియజేశాడు. ఎవరయితే పాకిస్థాన్ లో పర్యటిస్తారో వారిని ఐపిఎల్ ఆడకుండా చేస్తామని లంక క్రికెటర్లను భారత్ బెదిరించినట్లు తెలిపాడు. ఐపిఎల్ ఆడాలనుకునే ఆటగాళ్ళు పాక్ పర్యటనను బహిష్కరించాలని భారత్ వారిపై  తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందని సదరు  వ్యాఖ్యాత తెలియజేశాడు. 

ఇలా చీప్ టెక్నిక్స్ తో పాకిస్థాన్ ను భారత్ ఇబ్బందులపాలు  చేయాలనుకుంటోంది. ఇలాంటి హేయమైన చర్యలను ప్రతిఒక్కరూ ఖండిచాలి. ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీ ఇంత చీప్ గా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. స్పోర్ట్స్ నుండి స్పేస్ వరకు భారత్ సాగిస్తున్న ఉన్మాద చర్యలను  మేం  వ్యతిరేకిస్తున్నాం.'' అంటూ పాకిస్థాన్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫహద్ హుస్సెన్ వివాదాస్పద ట్వీట్ చేశాడు.     

ముందుగా రూపొందిచిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27నుండి కరాచీ వేదికన మూడు వన్డేలు,లాహోర్ లో మూడు టీ20లు జరగాల్సివుంది. పాక్ పర్యటన దృష్ట్యా శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం క్రికెటర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా టీ20, వన్డే జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న మలింగా, కరుణరత్నే సహా పదిమంది ఆటగాళ్లు పాక్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

2009లో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీలంక క్రికెటర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఏ దేశపు క్రికెట్ జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. కేవలం ఒక్క లంక  మాత్రమే కాదు పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. దీంతో గతకొన్నేళ్ళుగా పాక్ జట్టు ఇతర దేశాల్లోని తాత్కాలిక మైదానాల్లో అంతర్జాతీయ మ్యాచ్ లె ఆడుతోంది. 
 

సంబంధిత వార్తలు 

అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు