అసల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు.

ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు లంక జట్టు.. పాక్‌లో పర్యటించాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి వుంది. పాక్ పర్యటన దృష్ట్యా శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం క్రికెటర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా టీ20, వన్డే జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న మలింగా, కరుణరత్నే సహా పదిమంది ఆటగాళ్లు పాక్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

2009లో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీలంక క్రికెటర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఏ దేశపు క్రికెట్ జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు.