కెఎల్ రాహుల్‌కి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కినా, అతను మొదటి రెండు, మూడు మ్యాచులకు అందుబాటులో ఉండడం కష్టమే... మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌ని ఆడించాల్సిన పరిస్థితి.. 

ఆసియా కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. సెప్టెంబర్ 2న ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఎలాంటి హైడ్రామా లేకపోతే సెప్టెంబర్ 10న మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇది జరిగిన నెల రోజులకు అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మరోసారి తలబడతాయి ఇండియా- పాకిస్తాన్..

ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ జట్లు హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి. గత ఏడాది జరిగిన టీ20 ఆసియా కప్‌ టోర్నీలోనూ టీమిండియానే హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది. అయితే భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది..

పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ఆడగా లంక, ఆసియా కప్ 2022 విజేతగా నిలిచింది. వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌‌ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. బంగ్లాదేశ్, టీమిండియా మీద వన్డే సిరీస్ గెలిచిన జోరు మీదుంది. 

‘టీమిండియా కంటే పాకిస్తాన్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. మాకు బాబర్, ఫకార్ జమాన్, ఇమామ్, రిజ్వాన్ ఇలా టాపార్డర్‌లో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ ఆలీ, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్.. ఇలా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉంది.. 

కెఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి నాకు తెలిసి ఇషాన్ కిషన్‌ని నెం.5లో ఆడిస్తారేమో... అతను ఎప్పుడు ఎలా ఆడతాడో అతనికే తెలీదు. మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌కి మంచి రికార్డు కూడా లేదు. తిలక్ వర్మను మూడో స్థానంలో, విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించొచ్చు..

తిలక్ వర్మ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు. కాబట్టి ఎలా చూసినా వాళ్లకు 4, 5, 6 స్థానాల్లో సరైన ప్లేయర్లు లేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ టాపార్డర్‌లో ఉన్నారు. ఈ ముగ్గురూ ఆడితేనే టీమిండియా భారీ స్కోరు చేయగలదు. లేదంటే, ఇండియాని ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఓడించడం పాకిస్తాన్‌కి పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ ఆలీ.. 

కెఎల్ రాహుల్‌కి ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కినా, అతను మొదటి రెండు, మూడు మ్యాచులకు అందుబాటులో ఉండడం కష్టమేనని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే..

దీంతో కెఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ని తుది జట్టులో ఆడించాల్సి ఉంటుంది. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కి వస్తే, ఆ తర్వాతి స్థానంలోనే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయాలి. వన్డే ఓపెనర్‌గా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన మిడిల్ ఆర్డర్‌లో మాత్రం నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. 

సంజూ శాంసన్‌ని వన్డేల్లో మంచి రికార్డు ఉన్నా అతన్ని స్టాండ్ బై ప్లేయర్‌గానే ఎంపిక చేశారు. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్ కానీ, వన్డేల్లో ఇంకా ఆరంగ్రేటం చేయని తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కానీ వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా తుది జట్టులోకి రాలేరు. కాబట్టి కెఎల్ రాహుల్ ఆడలేకపోతే ఇషాన్ కిషన్‌ని కచ్ఛితంగా ఆడించాల్సిన పరిస్థితిలో ఉంది భారత జట్టు..