పాకిస్థాన్ యువ బౌలర్ మహ్మద్ అమీర్ ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఓ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 27ఏళ్ల వయసులోనే అతడు టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. అయితే అతడిలా అర్థాంతకంగా టెస్ట్  క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే దాగుందంటూ ఓ ప్రచారం జరుగుతోంది.  

అమీర్ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కొనసాగడంపై సంతృప్తిగా లేడట. అందువల్లే మెల్లిగా ఒక్కో ఫార్మాట్ నుండి తప్పుకుని తన భార్య సొంత దేశమైన ఇంగ్లాండ్  కు మకాం మార్చాలన్నది అతడి ఉద్దేశ్యమట. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టులో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. పాకిస్థాన్ కు చెందినవారు కూడా చాలా మంది ఆ జట్టు తరపున ఆడారు. కాబట్టి అమీర్ కూడా అలాగే ఇంగ్లీష్ జట్టులో చేరాలని భావిస్తున్నాడంటూ ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. 

ప్రస్తుతం పాకిస్థాన్ టీం పరిమిత ఓవర్ల  క్రికెట్ కంటే టెస్టు క్రికెట్ ప్రదర్శన అధ్వానంగా తయారయ్యింది. ఇలాంటి  సమయంలో మంచి ఫామ్ లో వున్న అమీర్ అదే ఫార్మాట్ కు దూరంగా వుండాలని అనుకోవడం పాక్ మాజీల ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ వంటి వారు అమీర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 

అయితే తాజాగా తన భర్త రిటైర్మెంట్ పై సాగుతున్న వివాదంపై అమీర్ భార్య నర్గీస్ మాలిక్ స్పందించారు. '' పాకిస్థాన్ క్రికెట్ కోసం ఎంతో కష్టపడుతున్న తన భర్త నిజాయితీనే శంకిస్తారా..? అయినా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన అనేది వ్యక్తిగత విషయం. దీనిపై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. 

ముఖ్యంగా అమీర్ ఇంగ్లాండ్ జట్టులో చేరడంకోసమే ఇలా చేస్తున్నాడంటూ జరుగుతున్న ప్రచారం మా కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తోంది. ఆయనకు ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. తన కెరీర్ మొత్తం ఈ పాకిస్థాన్ క్రికెట్ కే అంకితమని ఎప్పుడూ చెబుతుంటారు. అంతేకాదు ఒకవేళ తమ కూతురుని క్రికెటర్ గా చూడాలనుకున్నా పాక్ క్రికెటర్ గానే చూడాలనుకుంటాం. ఇంగ్లాండ్ క్రికెటర్ గా కాదు. అలాంటిది అమీర్ ఎలా ఇంగ్లాండ్ క్రికెటర్ గా మారడానికే ఇలా చేస్తున్నాడని ఆరోపించడం తమనెంతో భాధించింది.'' అని ఇంగ్లాండ్ సంతతికి చెందిన నర్గీస్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

27ఏళ్లకే రిటైర్మెంటా...! అమీర్ తొందరపడుతున్నావ్: వసీం అక్రమ్

టెస్ట్ క్రికెట్ కు అమీర్ గుడ్ బై... వన్డే, టీ20ల నుండి కూడా తప్పించాలి: అక్తర్ డిమాండ్

పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ అమీర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ ప్రకటన