పాకిస్థానీ యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పటికే పాక్ జట్టు టెస్టు ఫార్మాట్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇలా జట్టు సతమతమవుతున్న ఫార్మాట్ నుండే ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్న అమీర్ తప్పుకోవడం పాక్ అభిమానులనే కాదు మాజీ క్రికెటర్లకు కూడా నచ్చలేదు. దీంతో అమీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

అమీర్ రిటైర్మెంట్ పై పాక్ మాజీ దిగ్గజ వసీం అక్రమ్ స్పందించాడు. '' మహ్మద్ అమీర్ టెస్టుల నుండి రిటైరవుతున్నట్లు ప్రకటించాడని తెలిసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కేవలం 27-28 ఏళ్ల వయసులో అతడి రిటైరయ్యాడు. దీని వల్ల అతడిలోని అత్యుత్తమ ఆటగాడు ఎలా బయటకువస్తాడు. మన ప్రతిభను, సత్తాను నిరూపించుకునేందుకు ఇంత కంటే మంచి ఫార్మాట్ వుండదు. ఆస్ట్రేలియాతో 2, ఇంగ్లాండ్ తో 3 టెస్టు మ్యాచుల సీరిస్ ను త్వరలో పాకిస్థాన్ ఆడనుండి. ఈ మ్యాచుల్లో అమీర్ అవసరం పాకిస్థాన్ కు ఎంతో వుంది.'' అంటూ అమీర్ రిటైర్మెంట్ పై అక్రమ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.  

ఇక ఇదే అంశంపై మరో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా స్పందించాడు. అసలు 27ఏళ్ల వయసులోనే అమీర్ టెస్టు క్రికెట్ కు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడో తనకైతే అర్ధం కావడం లేదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసమే ఆ పని చేశానని అనడం నమ్మశక్యంగా లేదని అన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టీ20, వన్డేల్లో మెరుగ్గానే వుందని...టెస్టుల్లోనే తడబడుతోందని గుర్తుచేశాడు. కాబట్టి అమీర్ అవసరం పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్టులకే ఎక్కువ వుందని అక్తర్ పేర్కొన్నాడు. 

అయితే తన రిటైర్మెంట్ పై అమీర్ వాదన మరోలా వుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికట్ పై  ఎక్కువగా దృష్టి పెట్టేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నాడు. పాకిస్థాన్ జట్టు కోసం తన టెస్ట్ కెరీర్ ను త్యాగం చేయాల్సి వచ్చిందని అమీర్ రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా వెల్లడించాడు.