పాకిస్థానీ యువ క్రికెటర్, బౌలర్ మహ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో పాకిస్థాన్ టీం ను మరింత మెరుగైన స్థానంలో నిలబెట్టడానికే టెస్ట్ క్రికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చిందంటూ పేర్కొంటూ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఇలా 27 ఏళ్లకే అతడు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడాన్ని పాకిస్థాన్ కు చెందిన మాజీ ఆటగాళ్లు తప్పుబడుతున్నారు. అమీర్ టెస్టుల నుండి తప్పుకోని త్యాగం చేయలేదని కేవలం తప్పించుకోడానికి నాటకాలాడుతున్నాడంటూ విరరుచుకుపడుతున్నారు. ఇలా పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అమీర్ పై నిప్పులుచేరిగాడు. 

అసలు 27ఏళ్ల వయసులోనే అమీర్ టెస్టు క్రికెట్ కు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడో తనకైతే అర్ధం కావడం లేదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసమే ఆ పని చేశానని అనడం నమ్మశక్యంగా లేదని అన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు టీ20, వన్డేల్లో మెరుగ్గానే వుందని...టెస్టుల్లోనే తడబడుతోందని గుర్తుచేశాడు. కాబట్టి అమీర్ అవసరం పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే టెస్టులకే ఎక్కువ వుందని అక్తర్ పేర్కొన్నాడు. 

ఐదు రోజులపాటు ఆడాల్సివచ్చే టెస్ట్ క్రికెట్ ఆడటం కష్టమైన పనే. దీనివల్ల పేసర్లు మరింతగా అలసిపోయే అవకాశాలుంటాయి. కానీ ఆటగాళ్ల ఫిట్ నెట్, ప్రతిభ, జట్టు సామర్థ్యం బయటపడేది ఈ టెస్టు ప్రదర్శన వల్లే. అలాంటిది ఈ పార్మాట్ నుండి తప్పుకోవాలని అమీర్ తొందరపాటు నిర్ణయం తీసుకుని తప్పు చేశాడని అక్తర్ అన్నాడు. అతడిలాగే హసన్ అలీ, వాహబ్ రియాజ్ లు ఆలోచిస్తే పరిస్థితేంటని ప్రశ్నించాడు. 

కాబట్టి ఇలాంటి తప్పుడు నిర్ణయంతో పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ నే నాశనంచేసేలా వ్యవహరించిన అమీర్ కఠినంగా వ్యవహరించాలని పిసిబిని కోరాడు. తనకే అధికారాలుంటే అతన్ని  టీ20, వన్డేలు కూడా ఆడకుండా చేసేవాడినని అన్నాడు. ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అతన్ని కాపాడి మళ్లీ అవకాశాలిచ్చి పిసిబి తప్పు చేసిందన్నాడు. అమీర్ విషయంలో ఇకనైనా కఠినంగా వ్యవహరిస్తే మంచిదని అక్తర్ సూచించాడు. 

ఇక అంతకంతకు దిగజారుతున్న పాక్ క్రికెట్ ను మాజీ క్రికెటర్, దేశ ప్రధాని ఇమ్రాన్ ఖానే కాపాడగలడని అన్నాడు. ఆయన ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రక్షాళన చేపట్టాలని...అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది.  అలాగయితేనే పాకిస్థాన్ క్రికెట్ పూర్వవైభవాన్ని సంతరించుకోగలదని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.